బాలకృష్ణ హీరోగా ఇప్పటికీ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. గత ఏడాది మార్చిలో తన తండ్రి బయోపిక్‌ని మొదలు పెట్టి ఏడాది తిరక్కుండానే రెండు పార్టులుగా సినిమాని విడుదల చేసాడు. హీరోగా జోరు చూపించడమే కాదు.. కొత్తగా ఎన్‌బికె ఫిలిమ్స్‌ని స్థాపించి తన సినిమాలను తానే నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌ని తన ఓన్ బ్యానర్ ఎన్‌బికె ఫిలిమ్స్ లోనే సాయి కొర్రపాటి, విష్ణుతో కలిసి నిర్మించాడు. ఎన్‌బికె ఫిలిమ్స్‌లో ఎన్టీఆర్ బయోపిక్‌ని భారీ బడ్జెట్ తోనే నిర్మించాడు. తండ్రి బయోపిక్‌కి భారీ క్రేజ్ ఉంటుంది.. భారీగా లాభపడదామనుకున్నాడు బాలయ్య. తన తండ్రికి నివాళిగా నిర్మిస్తున్నాని చెప్పినా... లాభాలు ఆశించకుండా అయితే నిర్మించలేడు కదా.
మరి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడుతో దాదాపుగా 50 కోట్ల నష్టాన్ని చవిచూశాడు బాలకృష్ణ. కథానాయకుడు కొన్న బయ్యర్లు.. మహానాయకుడితో అయినా కోలుకుంటారనుకుంటే.. మహానాయకుడు కలెక్షన్స్ రోజు రోజుకి దిగజారిపోతున్నాయ్. కథానాయకుడుతో పాటుగా మహానాయకుడుని తీసుకున్న బయ్యర్ల నష్టాలు... బాలయ్య పూడుస్తాడో లేదో ఎవ్వరికి క్లారిటీ లేదు. మరి ఎన్‌బికె ఫిలిమ్స్‌లో నిర్మించిన మొదటి రెండు చిత్రాలు ఘోరాతి ఘోరంగా దెబ్బతినడంతో.. మళ్ళీ బాలయ్య మరో సినిమాని నిర్మించడానికి ఆలోచించాల్సిందే.
కానీ బాలయ్యకి ఆ అవకాశం లేదు. ఎందుకంటే బాలకృష్ణ.. బోయపాటితో కమిట్ అయిన సినిమాని కూడా ఎన్‌బికె ఫిలిమ్స్ లోనే ప్రొడక్షన్ నెంబర్3గా అనౌన్స్ చేసాడు. మరి కేవలం బాలకృష్ణే కాదు. బోయపాటి కూడా భారీ డిజాస్టర్ తో ఉన్నాడు. వినయ విధేయ రామతో బోయపాటి శ్రీను కూడా భారీగా దెబ్బతిని ఉన్నాడు. మరి బోయపాటిని నమ్మి బాలయ్య మళ్ళీ ఎన్‌బికె ఫిలిమ్స్ లోనే తన కొత్త సినిమా చేస్తాడో... లేదంటే మళ్ళీ పార్టనర్స్‌ని కలుపుకుంటాడో అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరి ఎంతో కాన్ఫిడెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తే... ఆ సినిమాతో భారీ షాక్ తిన్నాడు. మరి డిజాస్టర్ డైరెక్టర్‌తో బాలయ్య మళ్ళీ ఆ తప్పు చేస్తాడా అనేది చూడాలి.