కెరీర్‌ప్రారంభంలో మంచి మంచి కంటెంట్స్‌తో చిత్రాలు తీస్తూ వచ్చిన వర్మ ఈ మధ్యకాలంలో కేవలం పబ్లిసిటీలో తప్ప సినిమా కంటెంట్‌లో దమ్ము చూపలేకపోతున్నాడు. దాంతో ఆయన వీరాభిమానులు కూడా మొదటి రోజు ఆయన చిత్రాలను చూడటానికి సంకోచిస్తున్నారు. వారి నమ్మకాలను నిజం చేస్తూ వర్మ కూడా డిజాస్టర్స్ చిత్రాలను, అసలు ఆయనే తీశాడా? ఏదో తమాషాకి తీశాడా? అన్నట్లుగా నాసిరకం చిత్రాలను తీస్తున్నాడు. ఇక ఇటీవల ఎంతో బిల్డప్ ఇచ్చి మరీ నాగార్జునని ఒప్పించి చేసిన ‘ఆఫీసర్’ ఎంతటి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే.
ఇక విషయానికి వస్తే తన తండ్రికి నిజమైన నివాళి అంటూ, ఆ మహానుభావుడు ఎన్టీఆర్ బయోపిక్ అంటూ బాలయ్య తీసిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ కూడా డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. కథానాయకుడుకి కాస్త క్రేజ్ అయినా వచ్చింది. దాంతో మొదటి షోకి ముహూర్తంగా తెల్లవారు ఝామున 4గంటల 50 నిమిషాలకు సినిమాని థియేటర్లలో వేశారు. కానీ మహానాయకుడుకి మాత్రం ఉదయం 11 గంటల వరకు షో పడలేదు. బెనిఫిట్ షో కావాలని ఎవ్వరూ అడగకపోవడం, అలా షో వేసినా కనీస ప్రేక్షకులు కూడా రారని నిర్ణయించేసుకున్న బయ్యర్లు, ఎగ్జిబ్యూటర్లు ఈ విషయంలో ముందుగా జాగ్రత్త పడ్డారు. వంద చిత్రాలకు పైగా వైభవం ఉన్న బాలయ్య చిత్రం అసలు విడుదలైందా? లేదా? అనే అనుమానాలు వచ్చేలా విడుదల కావడం ఇదే ప్రధమం అని చెప్పాలి. దీంతో మహానుభావుల బయోపిక్స్‌ని తీసేటప్పుడు ఒకటికి రెండు సార్లు కాదు.. ఏకంగా ఒకటికి వందసార్లు ఆలోచించాలనే గుణపాఠాన్ని ‘ఎన్టీఆర్ బయోపిక్’ కల్పించింది.
ఇక ప్రస్తుతం అందరి దృష్టి వర్మ తీస్తోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పైనే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో అసలైన కథ మొదలయ్యే రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం నుంచి లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్ కావడం, ఆపై ఎన్టీఆర్‌కి వెన్నుపోటు వంటివి దాచిన ఫలితంగా మహానాయకుడు పెదవి విరుపులకు గురైంది. అయితే బాలయ్య అండ్ టీం ఎక్కడ ఆపారో వర్మ అక్కడి నుంచే తన చిత్రం ప్రారంభించనున్నాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తర్వాత కథను ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించనున్నాడు. వర్మ గత చిత్రాల కంటే ఈ చిత్రం కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది వాస్తవం.
ముఖ్యంగా లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సన్నివేశాలను తన చిత్రంలో చూపిస్తానని వర్మ జోరుగా ప్రచారం చేస్తున్నాడు. దాంతో ఈ చిత్రం ట్రైలర్‌కే కాదు.. ఈ చిత్రం విడుదల కోసం కూడా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిని చూస్తే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి డీసెంట్ ఓపెనింగ్స్ రావడం ఖాయమని తేలిపోతోంది. మరి ఇంత మంచి అవకాశం ద్వారా అయినా వర్మ ప్రేక్షకులు ఈ చిత్రంపై పెట్టుకున్న అంచనాలను అందుకుని మరలా ఫామ్‌లోకి వస్తాడా? లేక పబ్లిసిటీ, మాటలకే పరిమితం అవుతాడా? అనేవి వేచిచూడాల్సివుంది...!