తెలుగులో చిన్నచిన్నగా అడుగులు వేస్తూ, తెలుగుతో పాటు తమిళంలో కూడా గుర్తింపును తెచ్చుకుంటున్న హీరోయిన్ రాశిఖన్నా. ఈమె కెరీర్ రకుల్‌ప్రీత్‌సింగ్‌తో సమానంగా ప్రారంభం అయినా రకుల్ మాత్రం టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగితే రాశిఖన్నా మాత్రం పెద్ద హీరోల సరసన సెకండ్ హీరోయిన్, యంగ్ హీరోలతో సరిపెట్టుకుంటోంది. అతి తక్కువ కాలంలోనే తెలుగులో డబ్బింగ్ చెప్పడమే కాదు... ఏకంగా పాటలు పాడే స్థాయికి ఈమె చేరుకుంది. ఇక ఈమె కెరీర్‌లో ‘జైలవకుశ, తొలిప్రేమ’ వంటి చిత్రాలు మాత్రమే ఆమెకి మంచి పేరును తెచ్చాయి.
ఇక విషయానికి వస్తే రాశిఖన్నాకి తమిళంలో మంచి సక్సెస్ అయిన ‘రాక్షసన్’ తెలుగు రీమేక్‌గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రంలో హీరోయిన్ చాన్స్ వచ్చింది. దాంతో ఈ అమ్మడు మంచి సినిమా దక్కించుకుందని ఆనందం వెల్లడైంది. కానీ అనుకోని విధంగా ఈ చాన్స్‌ని అనుపమ పరమేశ్వరన్ సొంతం చేసుకుంది. దాంతో ఈ అమ్మడిని చూసి అందరు అయ్యో అనుకున్నారు. అదే సమయంలో విక్టరీ వెంకటేష్, మేనల్లుడు నాగచైతన్యల కాంబినేషన్‌లో ‘జైలవకుశ’ దర్శకుడు బాబి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ ‘వెంకీమామ’ చిత్రంలో అవకాశం వచ్చింది.
‘రాక్షసన్’ కంటే ‘వెంకీమామ’కే తెలుగులో మంచి క్రేజ్ ఉందనేది వాస్తవం. అందునా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కంటే నాగచైతన్య స్థాయే ఎక్కువ కావడం విశేషం. మొదట ఈ పాత్రకి రకుల్‌ప్రీత్‌సింగ్‌ని తీసుకోనున్నారని ప్రచారం సాగింది. కానీ అదే సమయంలో రకుల్ నాగార్జున నటిస్తున్న ‘మన్మథుడు 2’లో చాన్స్ రావడంతో అటు తండ్రి, ఇటు కొడుకుల సరసన ఏకకాలంలో నటించడం బాగా లేదని భావించిన సురేష్‌బాబు, నాగచైతన్య, బాబిలు కలిసి రాశిఖన్నాకి ఓటు వేశారు. మరి ఈ చిత్రం హిట్టు అయితే అయినా ఈమెకి మరిన్ని మంచి అవకాశాలు వస్తాయో లేదో వేచిచూడాలి...!