ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్‌లోని రెండు పార్ట్స్ అయిన ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ కూడా విడుదలయ్యాయి. కనీసం ‘కథానాయకుడు’ సమయంలో సరైన ప్రమోషన్స్ వల్ల మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ పాజిటివ్ టాక్ వచ్చినా రెండో రోజు నుంచే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం ‘అజ్ఞాతవాసి, స్పైడర్’ల తర్వాత తెలుగులో అతి పెద్ద డిజాస్టర్‌గా నమోదైంది. నిజానికి ‘అజ్ఞాతవాసి, స్పైడర్, వినయ విధేయ రామ’ వంటి చిత్రాలు డిజాస్టర్ అయినా కూడా వాటికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ విషయాలలో అది కూడా జరగలేదు. సినిమా విడుదలకు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ వీరాభిమానులు, మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గమైనా ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తారని భావిస్తే చివరకు అది కూడా జరగలేదు. ‘మహానాయకుడు’ కంటే నయనతార నటించిన డబ్బింగ్ చిత్రం ‘అంజలి ఐపిఎస్’కే పలు చోట్ల మంచి కలెక్షన్లు వచ్చాయంటే ఈ చిత్రం పరిస్థితిని ఊహించుకోవచ్చు.
ఇక అందరు అనుకున్నట్లుగానే మహానాయకుడులో చంద్రబాబునాయుడుని కాకుండా నాదెండ్ల భాస్కర్‌రావుని విలన్‌గా చూపించారు. దీనిపై నాదెండ్ల ఘాటుగా స్పందించాడు. ఆయన ఈ చిత్రాన్ని చూడకపోయినప్పటికీ చూసిన వారు చెప్పిన దానిని బట్టి ఈ విమర్శలు చేశాడు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ వారసులు, కుటుంబ సభ్యులు తీసిన ఈ చిత్రంపై అంత కంటే ఎక్కువగా ఆశించలేం. నిజానికి ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబే విలన్. తెలుగుదేశం పార్టీలో చేర్చుకోమని మొదట్లో చంద్రబాబే నా దగ్గరకు వచ్చాడు. సినిమాలతో నిజాలను మార్చలేరు. ఎన్టీఆర్ మరణానికి ఆయన కుటుంబసభ్యులే కారణం. ఎన్టీఆర్‌ని తీవ్రంగా క్షోభ పెట్టింది వారే.
ఆయన తన తిండి అవసరాల కోసం కొంత సొమ్ము దాచి పెట్టుకున్నారు. దానిపై కోర్టుకి వెళ్లి ఆయనకు తిండికి ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేశారు. ఎన్టీఆర్‌కి, లక్ష్మీపార్వతి సపర్యలు చేసింది. కానీ ఎన్టీఆర్ గెలిచిన తర్వాత మరలా వారంతా ఎన్టీఆర్ చుట్టూ చేరారు. ఎన్టీఆర్‌ని ఆయన వారసులు, కుటుంబ సభ్యులే తీవ్ర క్షోభకి గురి చేశారు. నన్ను ఈ చిత్రంలో విలన్‌గా చూపించడంపై నోటీసులు పంపాను. అధికారంలో ఉండటంతో వారు తమనెవ్వరు ఏమీ చేయలేరని భావిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని నాదెండ్ల తన కోపాన్ని వెల్లగక్కాడు.