తెలుగులో పూర్ణగా పరిచయమైన నటి షమ్నా ఖాసిం.. పలు తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించింది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును, అవును 2’లతో పాటు ‘శ్రీమహాలక్ష్మి, సీమటపాకాయ్, లడ్డుబాబు, నువ్విలా...నేనిలా, శ్రీమంతుడు, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు, జయంబునిశ్చయంబురా’ వంటి చిత్రాలలో నటించింది. మహేష్ ‘శ్రీమంతుడు’లో ఓ పాట చేసినా గుర్తింపు రాలేదు. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఈమెకి మంచి అవకాశాలు వచ్చాయి. తాజాగా ఈమెకి అనుకోని అదృష్టం తలుపుతట్టింది. తమిళ, తెలుగు భాషల్లో స్టార్‌గా పేరు తెచ్చుకున్న సూర్య సరసన నటించే అవకాశం ఈమెకి లభించింది.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సూర్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్‌జీకే’. (నంద గోపాల కుమరన్) చిత్రం చేస్తున్నాడు. మరోవైపు ఆయన ఓ భారీ మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘కాప్పన్’ చిత్రంలో ప్రధానమంత్రిగా మోహన్‌లాల్ నటిస్తూ ఉంటే.. ఆయనకు సెక్యూరిటీ గార్డ్‌గా సూర్య నటిస్తున్నాడు. ఆర్య ఇందులో పవర్‌ఫుల్ విలన్‌గా తన సత్తాచూపనున్నాడు. సమ్మర్ హాలీడేస్ కానుకగా ‘ఎన్జీకే’ని విడుదల చేసి, ‘కాప్పన్’ని స్వాతంత్య్రదినోత్సవ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఇండిపెండెన్స్‌డేకి ఆల్‌రెడీ ‘సాహో’ అన్ని భాషల్లో విడుదల కానుండటం వల్ల విడుదల తేదీలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.
ఇక ఇందులో సూర్య సరసన సాయషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాలో పూర్ణ క్యారెక్టర్ ఏమిటి? ఆమెకి సూర్యకి ఏమైనా రొమాన్స్ సీన్స్, పాటలుఉంటాయా? అనే విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. సూర్య సరసన తొలిసారి అవకాశం రావడంతో తాను ఎంతో ఎగ్జైట్‌గా ఉన్నానని పూర్ణ అంటోంది. దాదాపు 100కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ‘కాప్పన్’ మూవీని లైకా సంస్థ నిర్మిస్తూ ఉండటం విశేషం. ఇందులో సూర్య పూర్తి మేకోవర్‌తో ఎంతో ట్రెండీగా స్టైలిష్‌గా కనిపించనున్నాడట. మరి ఈ చిత్రం మంచి హిట్ అయితే పూర్ణ దశ తిరిగినట్లేనని చెప్పాలి.