తమిళ, మలయాళ భాషల్లో వచ్చే రేర్ ఫీల్‌గుడ్ ఫిల్మ్స్ అక్కడ పెద్ద విజయం సాధించినా, మన భాషలోకి వచ్చేసరికి నిరాశపరుస్తూ ఉంటాయి. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’, మలయాళ ‘ప్రేమమ్’ వంటివి దీని మచ్చుకు కొన్ని. నిజంగా ఇలాంటి చిత్రాలను రీమేక్ చేయడం కత్తి మీద సామే. తెలుగుకి అనుగుణంగా, తెలుగు నేటివిటీ, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేస్తే ఒరిజినల్ వెర్షన్‌లోని ఫీల్, ఆత్మ మిస్సయ్యే అవకాశం ఉంటుంది. పోనీ మక్కీకి మక్కీ తీస్తే తెలుగు ప్రేక్షకులకు మింగుడుపడదు. ఇప్పుడు ఇదే పరిస్థితి దిల్‌రాజుకి ఎదురవుతోంది.
ఆయన తమిళంలో విజయ్‌సేతుపతి - త్రిష జంటగా ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్ కుమార్‌తోనే 96 చిత్రం రీమేక్ చేయనున్నాడు. ఇప్పటికే విజయ్ సేతుపతి క్యారెక్టర్‌లో శర్వానంద్, త్రిష స్థానంలో సమంతలను తీసుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని ఇప్పటికే చూసిన పలువురు ఈ చిత్రాన్ని రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా దిల్‌రాజు మాత్రం రీమేక్ చేయడానికే రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్‌లో చేయాల్సిన మార్పులు చేర్పుల విషయంలో దిల్‌రాజుకి దర్శకుడు ప్రేమ్‌కుమార్‌కి క్రియేటివ్ డిఫరెన్స్‌లు తలెత్తాయని సమాచారం. తమిళంలో ఉన్నది ఉన్నట్లుగా తీయాలని దర్శకుడు భావిస్తుంటే దిల్‌రాజు మాత్రం మార్పులు తప్పనిసరి అని భీష్మించుకుని కూర్చున్నాడట.
ఇక ఈ చిత్రం ఒరిజినల్‌కి సంగీతం అందించిన గోవింద్ వసంత్‌నే తెలుగులోకి తీసుకోవాలని డైరెక్టర్ పట్టుబడుతుంటే దేవిశ్రీప్రసాద్‌ని ఎంచుకోవాలని దిల్‌రాజు ఒత్తిడి తెస్తూ ఉండటంతో ఈ విబేధాలు ముదిరాయని అంటున్నారు. అయినా ప్రీప్రొడక్షన్ స్టేజీలో ఏ చిత్రానికైనా ఇది మామూలేనని, కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక ఇటీవల కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ‘యూటర్న్’ చిత్రాన్ని కూడా ఒరిజినల్ డైరెక్టర్‌తోనే తీసినా ఆ చిత్రం ఫ్లాప్ అయింది. మరి ఈ ‘96’ విషయంలో తమిళ మక్కీకి మక్కీగా ఈ చిత్రం ఉంటుందా? లేదా మార్పులు చేర్పులు ఉంటాయా? అనేవి వేచిచూడాల్సివుంది...!