స్టార్స్ చిత్రాలు అంటే కాస్త ఆలస్యం కావడం సహజమే. అలాగని తమిళ శంకర్‌లా.. తెలుగులో మహేష్‌బాబులా ఆలస్యం అవుతుంటే మాత్రం ఇబ్బందే. ఇక ప్రస్తుతం మహేష్ తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రం చేస్తున్నాడు. వంశీపైడిపల్లి అంటే దిల్‌రాజు కాంపౌండ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మొదట దిల్‌రాజు ఒక్కడే నిర్మించాలని ప్లాన్ చేశాడు. కానీ గతంలో తనతో ‘సైనికుడు’ వల్ల నష్టపోయిన అశ్వనీదత్, ‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్ అందుకున్న పివిపిలను మహేష్ ఈ చిత్రంలో దిల్‌రాజుతో పాటే భాగస్వాములను చేశాడు. ఈ చిత్రం మొదట ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేస్తామని సినిమా ప్రారంభంలోనే అనౌన్స్ చేశారు.
కానీ ఆ తర్వాత మరలా ఏప్రిల్ 25 అన్నారు. అయినా ఆ తేదీకి కూడా ‘మహర్షి’ వచ్చేలా లేదు. ఏప్రిల్, మేలలోనే కాదు.. ఏకంగా సమ్మర్‌లో ఎలాంటి పోటీ లేకుండా వచ్చే చాన్స్‌ని కూడా మిస్ చేసుకుందని, జూన్‌లో తప్ప ఇది రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఏప్రిల్ 25న అని స్వయంగా దిల్‌రాజు ప్రకటించాడు. అదే ఆయన సోలో నిర్మాత అయ్యుంటే ఇలాంటి సమస్య వచ్చేది కాదంటున్నారు. ఇక తన కాంపౌండ్‌కే చెందిన అనిల్ రావిపూడితో మహేష్ 26వ చిత్రం ఉంటుందని, సుకుమార్-మైత్రి మూవీమేకర్స్ చిత్రం వాయిదా పడిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గ్యారంటీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ చిత్రాన్ని కూడా మొదట దిల్‌రాజు సోలో నిర్మాతగా ఉండాలని భావించినా చివరకు తన వల్ల ‘1 (నేనొక్కడినే), ఆగడు’ ద్వారా నస్టాలు చవిచూసిన అనిల్‌సుంకరను భాగస్వామిగా కలుపుకోమని మహేష్ ఆదేశించండంతో తప్పనిసరి పరిస్థితుల్లో దిల్‌రాజు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.
ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్, దిల్‌రాజులు వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ చిత్రాన్ని పోటీలో ఉంచాలని నిర్ణయించుకున్నారట. గతంలో దిల్‌రాజు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కూడా సంక్రాంతికే విడుదలైంది. అయినా మహేష్‌బాబుతో చిత్రం అంటే అది అనుకున్న తేదీకి రాదని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి-దిల్‌రాజుల ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది.