ఈ జనరేషన్‌కి తెలుసో తెలియదో గానీ ఒకప్పుడు ఆడ దెయ్యాలు అర్ధరాత్రి పూట ప్రతి ఇంటికి వస్తున్నాయనే పుకారు వచ్చింది. దాంతో మన మందల గుంపు వంటి జనాలు తమ గోడలపై, తలుపులపై ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసేవారు. అంటే ఏ రోజు వచ్చినా ‘రేపు రా’ అనేదే దాని అర్ధం. ఇక విషయానికి వస్తే చరిత్ర, వంశం అంటూ బీరాలు పలికే బాలయ్య బాబు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడని చెప్పాలి. తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఎప్పుడు ప్రశ్నలు ఎదురైనా వచ్చే ఏడాది మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతాడంటూ మాట మార్చకుండా తమది మాటపై నిలబడే వంశమని నిరూపిస్తున్నాడు.
వాస్తవానికి మోక్షజ్ఞ బాలయ్య వందో చిత్రం ‘గౌతమీ పుత్రశాతకర్ణి’లో చిన్న పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. ‘మనం’ చిత్రంలో అఖిల్ కనిపించినట్లుగా ఇది ఉంటుందని వార్తలు రావడం, వెంటనే బాలయ్య వాటిని ఖండించి వచ్చే ఏడాది మా అబ్బాయ్ సోలో హీరోగానే పరిచయం అవుతాడని మాట ఇచ్చాడు. ఆ వచ్చే ఏడాది ఎప్పుడు అనే విషయం మాత్రం కొనసాగుతూనే ఉంది. ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ చిత్రం విడుదలై రెండేళ్లు గడిచిపోయాయి.
ఇక తాజాగా ‘మహానాయకుడు’ విడుదల సందర్భంగా మరోసారి ఆయనకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. దానికి బాలయ్య సమాధానం ఇస్తూ వచ్చే ఏడాదే మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతాడని చెప్పుకొచ్చాడు. మరి వచ్చే ఏడాది అంటే ఏమిటో బాలయ్యకే తెలియాలి. ఇక ఇటీవల కాలంలో మోక్షజ్ఞ ఎవ్వరికీ కనిపించింది లేదు. కొందరేమో మోక్షజ్ఞ బాగా లావయ్యాడని, అందుకే ప్రస్తుతం సన్నబడే ప్రయత్నాలలో ఉన్నాడని, లావు తగ్గి స్లిమ్‌గా తయారైన తర్వాతే ఆయన హీరోగా నటిస్తాడని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మోక్షజ్ఞ ప్రస్తుతం నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడని, అది పూర్తయిన తర్వాత ఆయన హీరోగా నటించే తొలి చిత్రం ప్రారంభమవుతుందని అంటున్నారు. మరి దీనిలో నిజమేమిటో బాలయ్య అండ్ కో కే తెలియాలి....!