ఒకవైపు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’గా తీశాడు. ఈ రెండు పార్ట్‌లు విడుదలై పోయాయి. ఇక ప్రస్తుతం అందరి దృష్టి వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పైనే ఉంది. ఇక వర్మ ఆ మధ్య ‘మహానాయకుడు’ ఇంటర్వెల్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ని చూపిస్తాం. ‘మహానాయకుడు’ టిక్కెట్ కొనండి.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌చూడండి అని నానా హంగామా చేశాడు. కానీ చివరకు చూస్తే ‘మహానాయకుడు’ ఇంటర్వెల్‌లో వర్మ తన చిత్రం ట్రైలర్‌ని మాత్రం చూపించలేదు. మరోవైపు పలువురు సినీ పెద్దలు మాత్రం ‘మహానాయకుడు’ అద్భుతంగా ఉంది. కన్నీరు వచ్చాయని స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. వీరిలో తమ్మారెడ్డి భరద్వాజ, పూరీ జగన్నాథ్ వంటి వారు ఉన్నారు. అసలు అసంపూర్తిగా తీసిన బయోపిక్‌లో వారికి ఏం నచ్చిందనేదే అసలు ప్రశ్న.
మరోవైపు ‘కథానాయకుడు’ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ హాజరై అద్భుతంగా ఈ చిత్రం ఉంటుందని స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. కానీ ‘కథానాయకుడు’ విడుదల తర్వాత గానీ తాజాగా ‘మహానాయకుడు’ విషయంలో మాత్రం ఆయన మౌనంగానే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందునా ఇది తాతయ్య బయోపిక్ కావడం, బాలయ్య బాబాయ్ చేస్తూ ఉండటం, తాను ఎంతగానో ప్రేమించే తన తండ్రి హరికృష్ణ పాత్రను తన అన్నయ్య కళ్యాణ్‌రామ్ పోషించినా కూడా జూనియర్ మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘కథానాయకుడు’ విషయంలో కృష్ణ, మహేష్‌బాబులు సైతం స్పందించారు. కానీ జూనియర్ మౌనవ్రతం పాటిస్తున్నాడు. హరికృష్ణ మరణం తర్వాత జూనియర్‌కి బాలయ్య, చంద్రబాబులు దగ్గరయ్యారని బాగా వార్తలు షికారు చేశాయి. కానీ ఇప్పుడు జూనియర్ చూపిస్తున్న మౌనం చూస్తుంటే ఆ గ్యాప్ అలానే ఉందని స్పష్టమవుతోంది.
ఇక ‘మహానాయకుడు’పై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ వాస్తవాలకు దూరంగా ఉంది. రెండు పార్ట్‌లుగా దీనిని తీసినా అందులో ఎన్టీఆర్‌కి చివరి రోజుల్లో వెన్నంటే ఉన్న నా ప్రస్తావన మాత్రం తేలేదు. ఒకవేళ నన్ను ఈ చిత్రంలో చూపిస్తే ఎన్టీఆర్‌కి జరిగిన అసలు ద్రోహాన్ని కూడా ఇందులో చూపించాల్సివస్తుంది. ఆ ధైర్యం బాలయ్యకు లేదు. చంద్రబాబుతో అంటకాగుతున్న బాలయ్యకి, చంద్రబాబుని ద్రోహిగా చూపించేంత దమ్ము లేదు. ఈ విషయం నాకు ముందు నుంచి తెలుసు. తన తండ్రికి జరిగిన ద్రోహాన్ని బాలయ్య ఎప్పుడో మర్చిపోయాడు. ఇందులో నిజాయితీ లేదు కనుకనే ప్రేక్షకులు కూడా ఈ చిత్రాలకు సరైన తీర్పుని ఇస్తున్నారు. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బయోపిక్‌లోనే అసలు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. ప్రస్తుతం నేను ఆ చిత్రం కోసమే ఎదురుచూస్తున్నానని లక్ష్మీపార్వతి తన అభిప్రాయం వెల్లడించింది.