సాధారణంగా ఏదైనా చిత్రం హిట్టయితే దానిపై విమర్శలు వస్తాయి. కానీ అనుకోని డిజాస్టర్ అయితే, అసలు ప్రేక్షకులే పట్టించుకోని పరిస్థితుల్లో ఉంటే అందులో తమను ఎలా చూపినా ఫర్వాలేదు. అనవసర వివాదాలతో ఆ చిత్రాలకు పబ్లిసిటీ ఇవ్వడం ఎందుకు? అనే ఆలోచన వస్తుంది. ఇక రేపు ఎన్టీఆర్ బయోపిక్‌లోని రెండో పార్ట్ ‘మహానాయకుడు’ విడుదల కానుంది. మొదటి భాగం ‘కథానాయకుడు’ డిజాస్టర్ అయిన నేపధ్యంలో ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. ఇక ‘మహానాయకుడు’లో నాదెండ్ల భాస్కర్‌రావు, ఇందిరా గాంధీలను విలన్లగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ విషయం గురించి నాదెండ్ల, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చేయాలని భావించినా ప్రస్తుతం మౌనంగా ఉండటం చూస్తే ఆడని సినిమా మీద పడటం ఎందుకా? అనే ఉద్దేశ్యంలో వారు ఉన్నట్లు కనిపిస్తోంది.
తాజాగా నాదెండ్ల భాస్కర్‌రావు మాట్లాడుతూ, ‘నమ్మకద్రోహి’ అనేది ఎవరు అని ప్రజలు నిర్ణయిస్తారు. ఆరోజున ఏం జరిగింది అనేది నేటి జనరేషన్‌కి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నేను ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడవలేదు. ఎన్టీఆరే నన్ను వెన్నుపోటు పొడిచాడు. ఈ విషయమై జనాలను అడిగితే వారే నిజం చెబుతారు. నందమూరి ఫ్యామిలీ అభిప్రాయం ప్రకారం.. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన విషయంలో చంద్రబాబు పాత్రే లేదు. ఆయనదేమీ తప్పు లేదు. అందులో కేవలం నా పాత్రే ఉంది. పడిపోతున్న పార్టీని నిలబెట్టిన ఘనత చంద్రబాబుది అని వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం తంటాలు పడేందుకే ఇప్పుడు ఈ బయోపిక్ తీశారు. సినిమా అంటే నేను తెలుసుకుంది ఒక్కటే. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చూపించడమే సినిమా. గంటా, రెండు గంటలు ప్రేక్షకులను మభ్యపెట్టి వారి జేబుల్లోని డబ్బును తమ ఖాతాలో వేసుకునేదే సినిమా అని నా అభిప్రాయం. కనుక దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదని నాదెండ్ల భాస్కర్‌రావు చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో నటించిన అమ్మాయి ఎవరో సెన్సార్‌బోర్డ్ సభ్యురాలట. కాబట్టి ఆమె చెప్పినట్లే సెన్సార్ వారు నడుచుకుంటున్నారు. ఈ చిత్రంలోని నా పాత్రకి సంబంధించిన అభ్యంతరం గురించి ఈ సినిమా యూనిట్ ఇప్పటివరకు నన్ను సంప్రదించలేదు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ‘మహానాయకుడు’ అయినా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది...!