నాని నేచురల్ స్టార్‌గా ఒక్కో మెట్టూ ఎక్కుతూ మీడియం రేంజ్ లోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. నాని మీద పెట్టుబడి పెడితే.. సినిమాకి యావరేజ్ పడినా చాలు... మన డబ్బు మనకి వస్తుంది అనే భరోసా నాని దర్శకనిర్మాతలలో కలిగించాడు. అలాగే ఎంసీఏ సినిమా ప్లాప్ టాక్ పడినా.. ఆ సినిమాకి దిల్ రాజు లాభాలు మూటగట్టుకున్నాడు. ఇక నాని మాస్ యాంగిల్ ట్రై చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక లవర్ బాయ్ గా, క్లాస్ మూవీస్ లో మెప్పించిన నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన జెంటిల్‌మెన్ సినిమాలో టు షేడ్స్ ఉన్న పాత్రల్లో చెలరేగిపోయి నటించాడు. ఇక హీరోగా ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరస సినిమాలను లైన్‌లో పెడుతున్న నాని.. ప్రస్తుతం సెట్స్ మీదున్న జెర్సీ షూటింగ్ పూర్తి కావోస్తుండగా... రీసెంట్‌గా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాని లాంచ్ చేసాడు.
ఇక నాని 25వ సినిమా కూడా సెట్ అయ్యింది. అది ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని25 ఫిల్మ్ ఉండబోతుంది. అయితే ఇంద్రగంటి డైరెక్షన్ లో నాని హీరోగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కబోయే ఆ సినిమా ఆగిపోయిందనే న్యూస్ ఆ మధ్యన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా నాని - ఇంద్రగంటి సినిమా పట్టాలెక్కబోతుందని.. ఇదో మల్టీస్టారర్ సినిమాగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక నాని ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ అంటే విలన్‌గా కనిపిస్తాడని టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.
అలాగే నాని విలన్‌గా నటిస్తుంటే.. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. మరి నాని ఇప్పటివరకు చేసిన పాత్రలు ఒక ఎత్తు.. ఇప్పుడు ఇంద్రగంటి సినిమాలో విలన్ గా చేస్తే ఆ పాత్ర మరో ఎత్తు అవుతుందని.. అందుకే నాని ఆ నెగెటివ్ రోల్‌ని ఓకే చేసాడని అంటున్నారు. అయితే ఈ విషయంలో పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే నాని - ఇంద్రగంటి - దిల్ రాజుల ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలవుతుందని అంటున్నారు.