తన తండ్రి హరికృష్ణకి చంద్రబాబు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే కోపం జూనియర్ ఎన్టీఆర్‌లో ఉంది. 2009 ఎన్నికల్లో జూనియర్ తన తాత స్థాపించిన టిడిపి తరపున ప్రచారం చేశాడు. కానీ లోకేష్ సీన్‌లోకి రాగానే ఎన్టీఆర్ సైడ్ అయ్యాడు. నాటి నుంచి బాలయ్యతో, చంద్రబాబుతో ఎన్టీఆర్ అంటీ ముట్టనట్లే ఉంటున్నాడు. జూనియర్, హరికృష్ణలకు ఎంతో కావాల్సిన కొడాలి నాని సైతం వైసీపీలోకి వెళ్లడం వెనుక ఎన్టీఆర్ హస్తం ఉందని అంటారు.
ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవ్వరికీ మద్దతు ఇవ్వనని చెప్పాడు. గల్లా జయదేవ్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావులకు సీటు ఇస్తే మహేష్ మద్దతు ఇన్‌డైరెక్ట్‌గా టిడిపికి ఉంటుంది. ఇక బాలయ్య సరే.. జూనియర్ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే అర్ధం కావడం లేదు. తెలివిగా చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్ సోదరి సుహాసినికి కూకట్‌పల్లి టిక్కెట్ ఇచ్చి సోదరి కోసమైనా ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడని ఎత్తులు వేశాడు. కానీ వాటిని ముందుగానే ఊహించిన ఎన్టీఆర్ కేవలం పత్రికా ప్రకటనతో సరిపుచ్చాడు.
తాజాగా ఎన్టీఆర్‌కి పిల్లనిచ్చిన మామ, లక్ష్మీప్రణతి తండ్రి నార్నే శ్రీనివాసరావు జగన్‌ని లోటస్‌పాండ్‌లో కలవడం చర్చనీయాంశం అయింది. ఇది కేవలం మర్యాదపూర్వక కలయికే అని చెప్పిన ఇందులో రాజకీయ కోణం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ మామ వైసీపీలో చేరుతాడని వార్తలు వచ్చినా అవి జరగలేదు. మొత్తానికి ఇన్‌డైరెక్ట్‌గా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారో త్వరలో తేలనుంది.