గుడిసె కాలి ఒకడు ఏడుస్తుంటే.. బీడీ అంటించుకోవడానికి ఓ పెద్దాయన నిప్పు అడిగాడట. ఆ గుడిసె కాలిన మంటలో చలి మంటలు వేసుకున్నాడన్నట్లుగా ఉంది కమల్‌హాసన్ పరిస్థితి. ఇక విషయానికి వస్తే ఇటీవల కాశ్మీర్‌లోని పుల్వామాలో వీరజవాన్లను ఆత్మాహుతి ద్వారా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై, పాకిస్థాన్‌పై మన దేశంలోని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌కి ఎలాగైనా బుద్ది చెప్పాలనే డిమాండ్ పెరుగుతోంది.
కానీ క్రికెటర్ కం పొలిటీషియన్ నవజ్యోత్‌సింగ్ సిద్దు మాత్రం ఎవరో పిరికి పందలు చేసిన పనికి పాకిస్థాన్‌ని తప్పు పట్టడం ఏమిటి? ఇందులో పాకిస్థాన్ తప్పేముందని వితండవాదం చేస్తున్నాడు. కమల్‌హాసన్ అయితే కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, కాశ్మీరీలు ఇండియాలో అంతర్భాగంగా ఉండేందుకు సిద్దంగా ఉన్నారా? లేదా? అనే విషయంలో ప్లెబిసైట్ నిర్వహించాలని కొత్త రాగం అందుకున్నాడు. నిజానికి నెహ్రూ ఉదాసీనత వల్ల, చైనా మాయలో పడి పోవడం వల్ల ఇప్పటికే కాశ్మీర్‌లోని రక్షణకు ఎంతో కీలకమైన ప్రాంతాలను మనం పొగొట్టుకున్నాం. ఇప్పుడు ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కమల్ కోరుతున్నాడు. ఇందులో ఆయన అజ్ఞానమే కనిపిస్తోంది.
నిజానికి మనం ఇప్పటికీ చూపుకుంటున్న ఇండియా మ్యాప్‌లోని చాలా భాగం మనది కాదనేది చాలా మందికి తెలియదు. అయినా కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగంగా ఉండాలా? లేదా? అనే విషయంలో కేవలం కాశ్మీర్‌లో అభిప్రాయ సేకరణ చేస్తే వీలుకాదు. అసలు కాశ్మీర్ మనదేనా కాదా అనే విషయం మీద మన దేశవ్యాప్తంగా ప్లెబిసైట్ నిర్వహించాల్సి వుంది. అప్పుడే దానికి విలువ ఉంటుంది. ఇక ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న యువకుడు చిన్నతనంలో తన తప్పు లేకపోయినా సైనికులు ఆయనపై తీవ్రవాది అనే నేరం మోపి, ఏ తప్పు చేయని అతని చేత ముక్కును నేలకి రాయించడంతోనే కృంగిపోయి, కోపంతో రగిలిపోయి ఉగ్రవాదిగా మారాడని వస్తున్న వార్తలు మరింత సంచలనంగా మారుతున్నాయి.
అందరు కాదు గానీ దేశంలోని పోలీసులు, సైనికులు తామేమి చేసినా తప్పు లేదని ధోరణిలో అకృత్యాలు జరుపుతున్నారని కూడా ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు, సైనికుల అత్యుత్సాహం కొందరు రౌడీలుగా, ఉగ్రవాదులుగా మారడానికి కారణంగా నిలుస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు పోలీసులు, సైనికుల విషయంలో వారి ప్రవర్తన క్రమశిక్షణతో ఉండేట్లు చూడటం కూడా అవసరమేనని చెప్పాలి.