‘అజ్ఞాతవాసి’ విషయంలో త్రివిక్రమ్‌పై ఎన్ని విమర్శలు వచ్చాయో తాజాగా ‘వినయ విధేయ రామ’ విషయంలో బోయపాటి శ్రీనుపై దానికి మించిన విమర్శల దాడి జరిగింది. ఇక దానయ్యతో విభేదాలు వచ్చాయని, రామ్‌చరణ్ తన సారీ లెటర్‌లో బోయపాటి శ్రీను పేరు ప్రస్తావించలేదని.. ఇలా పలువిధాలుగా ఎన్నడు లేని విధంగా బోయపాటిపై ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు బోయపాటి తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో హ్యాట్రిక్ మూవీగా చేయనున్నాడు. ఈ హ్యట్రిక్ మూవీ అనే ట్యాగ్ బోయపాటికి అదనపు భారమనే చెప్పాలి. బోయపాటి మరలా తనని తాను నిరూపించుకోవాలంటే ‘సింహా, లెజెండ్’లని మించిన బ్లాక్‌బస్టర్ ఇవ్వాల్సివుంది.
మరోవైపు బాలయ్యపై కూడా పైసావసూల్, జైసింహా, కథానాయకుడు’ వంటి పరాజయాల ఎఫెక్ట్ ఉంది. ‘మహానాయకుడు’ విడుదలకు రెడీ అవుతున్నా ఈ చిత్రంపై భారీ అంచనాలు మాత్రం లేవు. ఇక బాలయ్య మార్కెట్‌కి తగ్గట్టే బోయపాటి చిత్రానికి కేవలం 40, 50కోట్ల మధ్యలోనే బడ్జెట్ కేటాయించారట. ఆయనకు సపరేట్ ఆఫీస్‌ని ఇవ్వకుండా తన ఎన్బీకే ఆఫీస్‌నే బోయపాటికి కేటాయించారనే వార్తలు వస్తున్నాయి.
ఒకవైపు బోయపాటిపై ‘వినయ విధేయ రామ’ ప్రెజర్, మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌తో బాలయ్య అతి పెద్ద డిజాస్టర్‌ని, విమర్శలను ఎదుర్కోవడం వంటి వాటిని మరిపించాలంటే ఏదో ఒక లైన్ అనుకుని, దానికి అనుగుణంగా సీన్స్ రాసుకుంటే సరిపోదు. బాలయ్యకి కనీవినీ ఎరుగని హిట్ ఇస్తేనే మరలా బోయపాటిని ఇతర హీరోల అభిమానులు, ఇతర స్టార్ హీరోలు నమ్ముతారు. మరి ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో బోయపాటిపై భారీ ఒత్తిడి, టెన్షన్ ఉన్నాయి. వీటిని ఆయన ఎంత వరకు అధిగమిస్తాడో వేచిచూడాల్సివుంది.