ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒకవైపున ఎన్నికలు దగ్గరకొస్తున్నా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అతి తక్కువ వ్యవధిలో ‘2.ఓ, పేట’ విడుదలయ్యాయి. వెంటనే మురుగదాస్ చిత్రాన్ని ఓకే చేశాడు. దీంతో రజనీ రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పిన మాట ఏమయింది? అనే ప్రశ్న అందరిలో ఉదయిస్తోంది. ఇదే సమయంలో తలైవా తాజాగా రాజకీయాలపై స్పష్టత ఇచ్చాడు. త్వరలో రానున్న లోక్‌సభ ఎలక్షన్లలో తమ పార్టీ పోటీ చేయడం లేదని చెప్పాడు. ఈ ఎన్నికల్లో మరో పార్టీకి కూడా మద్దతు ఇవ్వనని, తన ఫొటోలను, ఇతర విషయాలను ఏ పార్టీ ఉపయోగించుకోవడానికి వీలులేదని.. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే తాము పోటీ చేస్తామని చెప్పాడు.
మరోవైపు ‘పేట’ చిత్రం తెలుగులో సరిగా ఆడకపోయినా కూడా తమిళనాట ఈ చిత్రం 100కోట్లకు పైగా వసూలు చేసింది. రజనీ మ్యాజిక్‌ని ఈ చిత్రంతో మరలా కార్తీక్‌సుబ్బరాజ్ గుర్తుకు తెచ్చాడని అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇక ‘కాలా’ చిత్రం వేడుకలో రజనీ కీలకమైన ప్రకటన చేశాడు. తాను ఇకపై తన కూతురు వయసుండే హీరోయిన్లతో చిందులేయనని తన వయసుకు తగ్గ పాత్రలు, హీరోయిన్లతోనే కలిసి నటిస్తానని చెప్పాడు. ఇక మురుగదాస్ చిత్రం విషయానికి వస్తే మొదట్లో ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోందని, ‘సర్కార్’ షూటింగ్ సమయంలో ఆమె టాలెంట్ చూసిన మురుగ ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా ఈ విషయంలో రజనీ.. మురుగకు తన అభిప్రాయాన్ని చెప్పాడని, దాంతో కీర్తిసురేష్‌కి బదులు సీనియర్ హీరోయిన్, దక్షిణాది సూపర్‌స్టార్ నయనతారని ఇందులో ఎంపిక చేశారని తెలుస్తోంది. నయనతార గతంలో రజనీతో ‘చంద్రముఖి’ చిత్రంలో నటించగా, మురుగదాస్‌తో ‘గజిని’ చిత్రం చేసింది. వయసు పరంగా, సీనియర్‌గా, మరోవైపు రజనీకి సరైన జోడీగా, సినిమాకి మరింత నిండుదనం నయన వల్ల వస్తుందని రజనీ అభిమానులు ఆనందంగా ఉన్నారు. మరి రజనీ-నయనలతో మురుగదాస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాల్సివుంది.