బాలకృష్ణ - క్రిష్‌లు ఎట్టకేలకు సస్పెన్స్‌కి తెరదించి మహానాయకుడు ప్రమోషన్స్ సైలెంట్ గా మొదలెట్టేసాడు. ఎటువంటి హడావిడి లేకుండా మహానాయకుడు ట్రైలర్‌ని యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. సినిమా రాబోయే శుక్రవారమే విడుదలకు సిద్దమవుతుండడంతో.... సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెయ్యడమే కాకుండా ట్రైలర్‌ని కట్ చేసి వదిలేసింది క్రిష్ బృందం. అయితే కథానాయకుడు మీద భీభత్సమైన అంచనాలు పెట్టుకుంటే.. సినిమా తుస్ మనిపించింది. అందుకే మహానాయకుడిపై ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయడం లేదు బాలయ్య అండ్ బ్యాచ్. ఇక మహానాయకుడు ట్రైలర్ విడుదలయ్యాక ఏదైనా అద్భుతం జరుతుందనుకున్న నందమూరి అభిమానులకు మహానాయకుడు ట్రైలర్ చూసాక నోటమాటరాలేదు. అంత సాదాసీదాగా వుంది మహానాయకుడు ట్రైలర్.
అయితే మహానాయకుడు ట్రైలర్‌లో సినిమా మొత్తం ఎన్టీఆర్ అండ్ నాదెండ్ల భాస్కర్ రావు మధ్యనే నడిపించినట్లుగా కనబడుతుంది. నాదెండ్ల భాస్కర్ రావునే విలనీ చేశారు బాలయ్య అండ్ క్రిష్. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మొదలయ్యే నాటికే నాదెండ్ల తనని నెగెటివ్‌గా చూపిస్తే ఊరుకోనని.. కోర్టుకెళతానని బాలయ్య బాబుకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరి కొన్నాళ్లుగా నాదెండ్ల భాస్కర్ రావు.. ఎన్టీఆర్ బయోపిక్ విషయమై సైలెంట్ గానే ఉంటున్నాడు. తాజాగా విడుదలైన మహానాయకుడు ట్రైలర్‌తో నాదెండ్ల మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాడు. ఇక నాదెండ్ల మహానాయకుడిపై ఏమన్నా విమర్శలు చేయడం కానీ.. లేదంటే తన కేరెక్టర్ గురించి ఏమన్నా వ్యతిరేకత వ్యక్తం చెయ్యడం కానీ చెయ్యడం లేదు.
మహానాయకుడు ట్రైలర్ వచ్చి 36 గంటల సమయం పూర్తయినప్పటికీ.. నాదెండ్ల మాత్రం కామ్ గా ఉన్నాడు. మరి బాలయ్య అండ్ క్రిష్ లు మహానాయకుడుని నాదెండ్లకు చూపించి ఓకే చేశారా? లేదంటే మరేదన్నా జరిగిందా? ఎందుకు నాదెండ్ల భాస్కర్ రావు మహానాయకుడు విషయమై స్పందించడం లేదు. మరి సినిమా విడుదలకు ముందు అంటే రేపో ఎల్లుండో మహానాయకుడిపై నిప్పులు చెరిగే ప్రోగ్రాం ఏమన్నా నాదెండ్ల పెట్టుకున్నారా.. లేదంటే మరేదన్నా లోగుట్టు దాగుందా... ఏదిఎమైనా మహానాయకుడు సినిమాలో నాదెండ్ల మెయిన్ విలనిజం పండిస్తాడనేది మహానాయకుడి ట్రైలర్‌తో స్పష్టత వచ్చేసింది.