మెగామేనల్లుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి అతి తక్కువ చిత్రాలతోనే తన మార్కెట్‌ని 25కోట్లకు తీసుకెళ్లిన ఘనత సాయిధరమ్‌తేజ్‌ది. ఈయన తన కెరీర్ ప్రారంభంలో దిల్‌రాజు సలహాలతో ముందుకెళ్లాడు. ప్రారంభ చిత్రమైనప్పటికీ ఎప్పటికో విడుదలై ఘోరపరాజయం పాలైన వైవిఎస్ చౌదరి ‘రేయ్’ మినహా, ఈయన తన కెరీర్ మొదట్లో నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్, సుప్రీం’ చిత్రాలతో ఈయన హ్యాట్రిక్ హీరోగా దూసుకెళ్లాడు. మెగాస్టార్ వారసత్వాన్ని నిలబెట్టే హీరోగా కూడా ప్రశంసలు పొందాడు.
కానీ ‘తిక్క’ నుంచి ఈయన అదృష్టం తిరగబడింది. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో ‘తిక్క’, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘విన్నర్’, క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీతో ‘నక్షత్రం’, రచయిత కమ్ డైరెక్టర్ బి.వి.ఎస్.రవితో ‘జవాన్’, విక్టరీ వినాయక్ డైరెక్షన్‌లో ‘ఇంటిలిజెంట్’, కె.యస్.రామారావు నిర్మాతగా కరుణాకరన్‌తో ‘తేజ్ ఐ లవ్‌యు’ వంటి వరుస ఫ్లాప్‌లు మూటగట్టుకున్నాడు. ఇలా ఈయన డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్‌ని ఎదుర్కొన్నాడు.
ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వంటి అభిరుచి కలిగిన నిర్మాణ సంస్థలో ‘చిత్రలహరి’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్‌తో పాటు తండ్రికొడుకుల మధ్య సాగే అద్భుతమైన ఫీల్‌గుడ్‌గా రూపొందుతోందని సమాచారం. ఇందులో సాయికి తండ్రిగా పోసాని కృష్ణమురళి నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ చిత్రం గురించి తాజాగా మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ, ఇది తండ్రి కొడుకుల మధ్య తిరిగే కథ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. బలమైన కథ, కథనాలతో, అనూహ్యమైన మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది.
ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ మూవీ, నా పాత్ర, తండ్రి పాత్ర బాగా కనెక్ట్ అవుతాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ. వరుస పరాజయాల కారణంగా నన్ను విమర్శిస్తున్న అందరికీ ఈ చిత్రం సమాధానం చెబుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. కాగా ఏప్రిల్ 12న విడుదల కానున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.