అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా `మనం` సినిమాలో మెరిసిన అఖిల్ పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చేసిన సినిమా `అఖిల్`. తొలి సారి అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్‌కు భిన్నంగా యాక్షన్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు సరికదా ఘోర పరాభవాన్ని అందించింది. ఆ తరువాత `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ పక్కాగా రెడీ చేసిన కథని వద్దని నాగార్జున చెప్పిన లైన్‌తో అళ్లిన కథతో `హలో` అన్నా దాన్ని ప్రేక్షకులు ఛలో అన్నారే కానీ ఆదరించలేదు. ఇక `తొలిప్రేమ` వంటి హిట్ సినిమాని అందించాడని వెంకీ అట్లూరిని నమ్మి `మిస్టర్ మజ్ను` చేసినా పరాభవం తప్పలేదు.
అయితే హిట్టు కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు హిట్టివ్వడం కోసం గీతా ఆర్ట్స్ ముందుకొస్తోంది. `మిస్టర్ మజ్ను` ఫ్లాప్‌తో కంగుతిన్న అఖిల్‌కు ఈ సారి ఖచ్చితంగా హిట్టివ్వాలనే పట్టుదలతో గీతా ఆర్ట్స్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అఖిల్ తదుపరి చిత్రం హీరో ఆది బ్రదర్ సత్య ప్రభాస్‌తో వుంటుందని వార్తలు వినిపించాయి. అఖిల్ కూడా అటు ఇటుగా అతనితోనే తదుపరి సినిమా వుంటుందని చెప్పేశాడు. కానీ `మిస్టర్ మజ్ను` ఫలితం షాకివ్వడంతో అనుభవం వున్న వాళ్లతో అయితే బెటర్ అన్న నిర్ణయానికి అఖిల్ వచ్చాడని, అందులో భాగంగానే గీతా ఆర్ట్స్‌లో తదుపరి సినిమాకు ఓకే చెప్పాడని తెలిసింది.
గీతా ఆర్ట్స్ దగ్గర ఇప్పుడు ఇద్దరు దర్శకుల డేట్స్ వున్నాయి. ఒకరు పరశురామ్, మరొకరు బొమ్మరిల్లు భాస్కర్. ఈ ఇద్దరిలో అఖిల్‌ను ఎవరు తన కథతో ఒప్పిస్తే వారితో సినిమా వుంటుందట. ఇది అల్లు అరవింద్ పెట్టిన కండీషన్. మరో వారంలో అఖిల్‌కు ఈ ఇద్దరు దర్శకులు కథ చెప్పబోతున్నారు. ఎవరి కథని అఖిల్ ఫైనల్ చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అన్నీ కరెక్ట్‌గా సెట్టయితే అఖిల్, గీతా ఆర్ట్స్ కలయికలో వచ్చే సినిమా మరో రెండు లేదా మూడు నెలల్లో సెట్స్‌పైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో అక్కినేని వారబ్బాయికి గీతా ఆర్ట్స్ అయినా హిట్టిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.