ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల హవా నడుస్తోంది. ఎంతటి స్టార్ చిత్రమైనా సరే అందులో నవ్వించే కామెడీ లేకపోతే జనాలు పట్టించుకోవడం లేదు. కానీ నాడు ‘మాతృదేవోభవ’ నుంచి నిన్నమొన్నటి ‘నాన్నకుప్రేమతో’ వరకు హ్యూమన్ ఎమోషన్స్‌తో నిండిన చిత్రాలు ఎన్నో ఘనవిజయం సాధించాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, స్నేహితుల అనుబంధం నేపధ్యంలో మంచి ఎమోషన్స్ పండించి ఫీల్‌గుడ్ చిత్రంగా మలిస్తే వాటికి ఏనాడు తిరుగుండదనే చెప్పాలి. అంతేగానీ ప్రేక్షకులు ఏ తరహా చిత్రమైనా కామెడీని మాత్రమే కోరుకుంటారనడంలో నిజం లేదు. ఇక స్టార్ హీరోల చిత్రాలలో ఎమోషన్స్‌ని ఎంతో జాగ్రత్తగా డీల్ చేయాలి. స్టార్స్ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుంటూనే అన్నింటిని సమపాళ్లలో నింపి, ఎమోషన్స్‌ని పండించాలి. అంతేగానీ మామూలు హీరోల చిత్రాల వలే వారి క్రేజ్‌ని పట్టించుకోకుండా సెంటిమెంట్ పండిస్తే ఇబ్బందులు వస్తాయి.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్‌బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిల కాంబినేషన్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో మహేష్ లుక్, మేకోవర్ కూడా డిఫరెంట్‌గా ఉండనుంది. ఈ మేరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మహేష్ ఫొటోలు ఆయన్ని కొత్తగా చూపించాయి. ఓ మామూలు మనిషి ‘మహర్షి’గా ఎలా మారాడు? అనేదే మెయిన్ పాయింట్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో స్నేహితుడైన అల్లరినరేష్‌తోపాటు తల్లిదండ్రుల ఎమోషన్స్ ఫీల్‌గుడ్‌గా ఉంటాయని తెలుస్తోంది.
తాజాగా దిల్‌రాజు మాట్లాడుతూ, ఈ చిత్రం పూర్తిగా చూసి థియేటర్ల బైటికి వచ్చిన వారు హృదయం బరువెక్కి, ఎంతో ఎమోషనల్‌గా వస్తారని చెప్పాడు. సో.. ఇది మంచి సెంటిమెంట్ ఉన్న చిత్రమేనని తెలుస్తోంది. బహుశా ఇలాంటి సబ్జెక్ట్ చేయడం మహేష్‌కి ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. సెంటిమెంట్ ఉంటే వాటికి మహిళా, ఫ్యామిలీ ఆడియన్స్ పట్టం కడుతారు. మరి ఈ చిత్రం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలంటే ఏప్రిల్ 25వరకు ఆగాల్సిందే.....!