ఒకప్పుడు రజనీకాంత్, కమల్‌హాసన్, విక్రమ్, టి.రాజేందర్, శింబు వంటి వారికి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. వారి చిత్రాలు తెలుగులో కూడా విడుదలై ఘన విజయాలు సాధించేవి. నాడు డబ్బింగ్ చిత్రం అంటే బంగారు బాతుగుడ్డుగా భావించేవారు. ఇక సూర్య, కార్తిలు కూడా తెలుగులో మంచి క్రేజే తెచ్చుకున్నారు. శింబు, ధనుష్, అజిత్, విజయ్ వంటి వారి కంటే సూర్య, కార్తిల సోదరులకే తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. కానీ ఇటీవల వారి జోరుకి కూడా అడ్డుకట్ట పడినట్లుగా కనిపిస్తోంది. సూర్య నుంచి సరైన హిట్ వచ్చి ఎంతో కాలం అయింది. ‘24’ తమిళంలో నిరాశ పరిచి, తెలుగులో జస్ట్ ఓకే అనిపించుకుంది. ఇక ‘ఎస్ 3’గా వచ్చిన ‘సింగం’సిరీస్, ‘గ్యాంగ్’ చిత్రాలు కూడా బాగా నిరాశపరిచాయి.
ఇక ప్రస్తుతం ఈయన తమిళంలో సెల్వరాఘవన్‌గా తెలుగులో శ్రీరాఘవగా పేరున్న దర్శకునితో ‘ఎన్జీకే’ చిత్రం చేస్తున్నాడు. ‘ఎన్జీకే’ అంటే (నందగోపాల కుమరన్)గా వస్తోన్న ఈ చిత్రం ఓ మామూలు వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌గా మారి, రాజకీయాలలోకి వెళ్లే పాయింట్‌తో తెరకెక్కుతోంది. గతంలో శ్రీరాఘవ దర్శకత్వంలోనే ధనుష్ చేసిన ‘పుదుపెట్టై’లో నటించాడు. తెలుగులో ఇది ‘ధూల్‌పేట’గా విడుదలైంది. ఆ ఛాయలతోనే ‘ఎన్జీకే’ రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. దీనితో పాటు సూర్య ‘కప్పన్’లో కూడా చేస్తున్నాడు.
ఇక తమ్ముడు కార్తి విషయానికి వస్తే ఆయన ‘ఆవారా, నాపేరు శివ’ వంటి చిత్రాలతో రాణించాడు. తర్వాత ఇటీవల ‘ఖాకీ, ఊపిరి’తో ఓకే అనిపించినా, తాజాగా విడుదలైన ‘దేవ్’ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కూడా లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. మొత్తానికి సూర్య, కార్తిలకు తెలుగులో మాత్రం ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి ఈ అపూర్వసహోదరులు రాబోయే కాలంలో ఏమాత్రం తెలుగులో నెట్టుకొస్తారో వేచిచూడాల్సివుంది...!