ఒకనాడు చిరంజీవితో సినిమాలు తీయాలని ఆశపడే నిర్మాతలు భారీగా ఉండటంతో ఆయన ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలిసి భాగస్వామ్యంతో చిత్రాలు తీయాలని సూచించాడు. కానీ ఆ విషయంలో ఆయన పెద్దగా మాట నిలుపుకోలేదు. కానీ మహేష్‌బాబు మాత్రం దానిని చేసి నిరూపిస్తున్నాడు. తనతో ‘బ్రహ్మోత్సవం’ తీసి భారీగా నష్టపోయిన పివిపిని, తనని వెండితెరకు సోలో హీరోగా ‘రాజకుమారుడు’తో పరిచయం చేసి, ఆ తర్వాత ‘సైనికుడు’ వంటి డిజాస్టర్‌ని ఇచ్చిన అశ్వనీదత్‌లకు దిల్‌రాజుని కలిపి వారి ముగ్గురి భాగస్వామ్యంలో ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రం చేస్తున్నాడు.
దిల్‌రాజు ఇకపై మీడియం బడ్జెట్ చిత్రాలపై మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని, పెద్ద స్టార్స్ చిత్రాలను మాత్రం భాగస్వామ్యంతో నిర్మించాలని భావిస్తున్నాడు. అందుకే గతంలో వెంకటేష్, మహేష్‌బాబులతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి మల్టీస్టారర్స్‌కి శ్రీకారం చుట్టిన ఆయన ‘మహర్షి’లో భాగస్వామిగా ఉన్నాడు. ఇక విషయానికి వస్తే ‘మహేష్’ ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం ‘మహర్షి’. దీని తర్వాత మహేష్ 26వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్‌తో చేయనునున్నాడని అఫీషియల్ స్టేట్‌మెంట్, పత్రికల్లో ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ సుక్కు.. మహేష్ కోసం చెప్పిన రెండు లైన్స్ ఆయన్ని మెప్పించలేకపోయాయట. దాంతో మరో లైన్‌ని మహేష్ ఓకే చేశాడు. ఇప్పటికే ‘1’ నేనొక్కడినే డిజాస్టర్‌తో కసి మీద ఉన్న సుకుమార్ ఈ స్ర్కిప్ట్ పూర్తిగా తయారుచేయడానికి ఆరునెలల సమయం కోరాడట. దాంతో ఆల్‌రెడీ మహేష్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన అనిల్ రావిపూడితో నాలుగైదు నెలల్లో స్పీడుగా ఓ చిత్రం చేసి, తర్వాత సుక్కు చిత్రం చేయాలని మహేష్ భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
స్పీడుగా చిత్రాలను తీయడంలో అనిల్ రావిపూడి సిద్దహస్తుడు. ఆయన ‘సుప్రీం, రాజా దిగ్రేట్, ఎఫ్2’ వంటి వరుస చిత్రాలను దిల్‌రాజుకి చేస్తున్నాడు. దాంతో మహేష్ -అనిల్‌రావిపూడిల చిత్రానికి కూడా దిల్‌రాజే నిర్మాత అని తెలుస్తోంది అయితే ఇక్కడ కూడా మహేష్‌తో ‘దూకుడు’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చి తర్వాత ‘1’ (నేనొక్కడినే), ఆగడు చిత్రాల ద్వారా నష్టపోయిన 14 రీల్స్‌ని దిల్‌రాజు భాగస్వామ్యంతో ఈ చిత్రం చేయమని మహేష్ కోరడంతో అనిల్ చిత్రానికి దిల్‌రాజు, 14రీల్స్ భాగస్వామ్యం ఖాయమైందని సమాచారం.