సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ కాంపౌండ్ హీరోలుగా మహేష్‌బాబు తర్వాత ఆయన బావ సుధీర్‌బాబుని చెప్పాలి. ఈయన హీరోగా తెరంగేట్రం చేసి ‘ప్రేమకథా చిత్రమ్’తో మంచి హిట్ కొట్టాడు. ఇంకా ఆయన ‘భలే మంచి రోజు, ఆడు మగాడ్రా బుజ్జి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, శమంతకమణి’ వంటి పలు చిత్రాల ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు నటించిన ‘సమ్మోహనం’ చిత్రం ఆయనకు మరో హిట్‌ని ఇచ్చింది.
ఇక ఈయన తెలుగు ‘వర్షం’కి రీమేక్‌గా బాలీవుడ్‌లో తీసిన ‘భాగీ’ చిత్రంలో విలన్‌గా మెప్పించాడు. తెలుగులో గోపీచంద్ చేసిన ఈ పాత్ర కోసం సిక్స్‌ప్యాక్ బాడీ సాధించి తన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో పుల్లెల గోపీచంద్ బయోపిక్‌తో పాటు పలు తెలుగు చిత్రాలలో, కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవల ఆయన మాట్లాడుతూ, త్వరలో వెబ్‌సిరీస్‌లలోకి కూడా ప్రవేశిస్తానని చెప్పాడు.
తాజాగా ఆయన తను అన్న మాటకి కట్టుబడి ఓ వెబ్‌సిరీస్‌కి ఓకే చెప్పాడు. అది మరెవరి వెబ్‌సిరీసో కాదు.. స్వయంగా మహేష్‌బాబు నిర్మాణంలో, నమ్రతా పర్యవేక్షణలో రూపొందే ‘చార్లీ’ అనే వెబ్‌సిరీస్. ఇది ఎనిమిది ఎపిసోడ్లుగా నిర్మితం కానుంది. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో సుకుమార్‌తో కలిసి పనిచేసిన హుస్సేన్ షా కిరణ్ దీనికి దర్శకరచయిత. ఇక మహేష్ ఎప్పటి నుంచో వెబ్‌సిరీస్ తీయాలనే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. టైటిల్ ‘చార్లీ’ అని, మహేష్ ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకరు ఈ వెబ్‌సిరీస్‌లో నటిస్తారని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ వార్తలకు బలం చేకూరుతూ సుధీర్‌బాబు ఇందుకే ఓకే చెప్పాడు.
మొత్తానికి మారుతున్న జనరేషన్‌కి అనుగుణంగా వెండితెరపైనే కాకుండా ఇలాంటి వెబ్‌సిరీస్‌లలో కూడా నటించేందుకు ఒప్పుకున్న సుధీర్‌బాబుకి హ్యాట్సాఫ్ చెప్పాలి. మరి ఈ ఎనిమిది ఎపిసోడ్ల ‘చార్లీ’ని యూట్యూబ్‌లో విడుదల చేస్తారా? లేక అమేజాన్ వంటి డిజిటల్ స్ట్రీమింగ్‌లో ఇది వస్తుందా? అనేది వేచిచూడాల్సివుంది.