తెలుగులోనే కాదు కన్నడ, తమిళ, బాలీవుడ్ చిత్రాలలో కూడా పోలీస్‌స్టోరీలు అంటే హిట్ ఫార్ములా కింద లెక్క, సాయికుమార్ కన్నడలో చేసిన ‘పోలీస్ స్టోరీ’, తెలుగులో రాజశేఖర్ నటించిన ‘అంకుశం’తో పాటు తమిళంలో కూడా ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి సైతం తన బాలీవుడ్ ఎంట్రీకి ‘అంకుశం’ రీమేక్‌నే ఎంచుకున్నాడు. ఇలా తెలుగులో కూడా రాజశేఖర్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రల ద్వారానే మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి మరువరాదు. అయితే పోలీస్ చిత్రాలు అంటే నాటి ‘కొండవీటి సింహం’ నుంచి ‘లక్ష్మీనరసింహ’ నిన్నటి ‘టెంపర్’ వరకు ఎన్నో ఉన్నాయి. తమిళంలో ‘సింగం’ సీక్వెల్ గురించి తెలిసిందే. కానీ పోలీస్ చిత్రాలంటే అరుపులు, గోలలు, చంపుకోవడాలు.. ఇలా భీభత్సంగా ఉంటాయనే ఫార్ములాని మార్చి తమిళంలో సూర్య, జ్యోతిక జంటగా ‘కాకా కాకా’తో ట్రెండ్‌ని మార్చిన దర్శకుడు మాత్రం గౌతమ్ వాసుదేవ మీనన్ అనే చెప్పాలి.
ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్‌గా ‘ఘర్షణ’ పేరుతో వెంకటేష్ చేశాడు. తెలుగులో జ్యోతిక పాత్రను ఆసిన్ పోషించగా, తమిళంలో జ్యోతిక మరణిస్తే , తెలుగులో మాత్రం ఆసిన్‌ని బతికించారు. ఈ రెండు భాషల చిత్రాలకు గౌతమ్‌మీననే దర్శకుడు కాగా, కలైపులి థాను నిర్మాత. అయితే తెలుగులో శివరాజు, వెంకటరాజులతో పాటు థాను గీతా చిత్ర ఇంటర్నేనేషనల్ సంస్థ నిర్మించింది. హరీస్‌జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం తమిళంలో ఆడినట్లుగా తెలుగులో ఆడకపోయినా కూడా ప్రశంసలు మాత్రం లభించాయి. దాంతో 16ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఆ పోలీస్ ఆఫీసర్ ఏమి చేస్తున్నాడు? అనే పాయింట్‌తో గౌతమ్ దీనికి సీక్వెల్ తీయనున్నాడని కోలీవుడ్ సమాచారం. ఈ లైన్‌కి సూర్య కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.
ప్రస్తుతం గౌతమ్ విశాల్‌తో ఓ చిత్రం చేయాల్సివుంది. మరోవైపు సూర్య ‘ఎన్జీకే’(నందగోపాలకృష్ణ)- కాప్పన్ చిత్రాల బిజీలో ఉన్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాత ‘కాకా కాకా’కి సీక్వెల్ పట్టాలెక్కనుంది. అయితే ‘కాకా కాకా’ నాటికి సూర్యకి తెలుగులో ఇమేజ్ లేదు. దాంతో వెంకీతో రీమేక్ చేశారు. కానీ ప్రస్తుతం సూర్యకి తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ఉంది. కాబట్టి ఇందులోని ‘డిసిపి రామచంద్ర ఐపిఎస్’ని తెలుగులో వెంకీతో రీమేక్ చేసే అవకాశం లేదు. తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్య-గౌతమ్‌ల సీక్వెల్ విడుదలయ్యే పరిస్థితి ఉందని చెప్పవచ్చు.