స్టార్ హీరోలు సైతం నేడు నవతరం దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి జంకడం లేదు. మహేష్‌బాబు తాజాగా అనిల్‌రావిపూడి, సందీప్‌రెడ్డి వంగా వంటి వారితో చేయడానికి ఆసక్తి చూపుతూ ఉండటమే దీనికి పెద్ద ఉదాహరణ. నేడు ప్రతి హీరో కూడా ఆల్‌రెడీ ప్రూవ్ అయిన దర్శకులతో పాటు కొత్తతరం వారిని కూడా లైన్‌లో పెడుతూ, సమతుల్యం పాటిస్తున్నారు. ఈ కోవలోకి తాజాగా ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా చేరాడు. ఈయన మొదటి చిత్రం కాస్త అనుభవం ఉన్న వైవిఎస్ చౌదరి ‘దేవదాస్’తో జరిగింది. ఆ వెంటనే అప్పటికి పెద్దగా అనుభవం లేని సుకుమార్‌తో ‘జగడం’ చేశాడు. ఈయన తన కెరీర్‌లో బి.గోపాల్, కరుణాకరన్, శ్రీనువైట్ల, కె.విజయభాస్కర్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి వారితో పాటు సంతోష్‌శివన్, శ్రీవాస్, గోపీచంద్ మలినేని, కిషోర్‌తిరుమల, నక్కిన త్రినాథరావు వంటి వారితో చిత్రాలు చేస్తూ వచ్చాడు.
తాజాగా ఈయన పూరీ జగన్నాథ్‌తో ‘ఇస్మార్ట్‌శంకర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పూరీ తనదైన శైలిలో వేగంగా తీస్తున్నాడు. ఇటు వరస పరాజయాలతో ఉన్న రామ్, పూరీ, నిధి అగర్వాల్ వంటి వారికి ఇది అత్యంత కీలకంగా కానుంది. ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో రామ్ మరో యంగ్ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
రాజేంద్రప్రసాద్ నటించిన ‘అయ్యారే’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమై, నారా రోహిత్, శ్రీవిష్ణులతో ‘అప్పట్లో ఒకడుండే వాడు’ ద్వారా కమర్షియల్‌గా మంచి విజయాన్ని, విమర్శకుల ప్రశంసలు పొందిన సాగర్. కె.చంద్ర దర్శకత్వంలో నటించేందుకు రామ్ ఓకే చెప్పాడట. సాగర్ చెప్పిన లైన్ బాగా నచ్చడంతో పూరీ చిత్రం పూర్తయ్యే లోపు ఫుల్‌స్క్రిప్ట్‌ని పూర్తి చేయమని, స్క్రిప్ట్ ఇంకా బాగా నచ్చితే తమ హోం బేనర్ అయిన స్రవంతి మూవీస్‌లోనే చేస్తానని హామీ ఇచ్చాడట. ‘అప్పట్లో ఒకడుండే వాడు’ తర్వాత సాగర్‌కి చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో ఆయన వరుణ్‌తేజ్‌తో చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అది ఎందుకో పట్టాలెక్కలేదు. అదే స్టోరీకి కాస్త మార్పులు చేర్పులు చేసి రామ్‌ని సాగర్ ఒప్పించాడని తెలుస్తోంది.