తెలుగులో కేవలం మూడు మినిమం బడ్జెట్ చిత్రాలతోనే మంచి అభిరుచి ఉన్న నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది 70ఎం.ఎం. సంస్థ. తమ మొదటి చిత్రాన్ని సుధీర్‌బాబు హీరోగా ‘భలే మంచి రోజు’, రెండో చిత్రాన్ని మహి.వి.రాఘవతో హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తాప్సి, శ్రీనివాసరెడ్డి వంటి వారితో ‘ఆనందో బ్రహ్మ’, తాజాగా మరోసారి మహి.వి.రాఘవతోనే మమ్ముట్టి హీరోగా వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సెమీ బయోపిక్ ‘యాత్ర’లతో ఈ సంస్థ మెప్పించింది. తాజాగా ఈ సంస్థ మరో డేరింగ్ స్టెప్ తీసుకుంది.
ఇక విషయానికి వస్తే 25 ఏళ్ల కిందట నాడు ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న జగపతిబాబు, ఆమని, రోజాల కాంబినేషన్‌లో ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ‘శుభలగ్నం’ చిత్రం కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది. మధ్యతరగతి మొగుడుగా, లంచాలు తీసుకోవడం చేతకాని, ఉన్నది చాలనుకునే భర్తగా జగపతిబాబు, డబ్బుపిచ్చితో భర్తని ఇబ్బందులకు గురి చేసి, చివరకు కోటి రూపాయల కోసం భర్తని మరో స్త్రీకి ఇచ్చి పెళ్లి చేసే గృహిణి పాత్రలో ఆమని, కోటిరూపాయలతో జగపతిబాబుని తన భర్తని చేసుకుని, అన్ని విషయాలలో భర్తకు అండగా ఉండే యువతిగా రోజా నటించిన ఈ చిత్రం అద్భుతమనే చెప్పాలి.
ఇంత కాలం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని 70ఎం.ఎం. సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పుడు జగపతిబాబు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. ఆమని సైతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంటే , రోజా రాజకీయాలు, బుల్లితెర, ఎప్పుడో కాస్త ప్రత్యేక పాత్రలు చేస్తోంది. నాడు అమ్ముడు పోయిన భర్త ఇప్పుడు ఎలా ఉన్నాడు? అనే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. మరి నాడు కోటిని ఇప్పటి పరిస్థితులకు 100కోట్లగా మార్చినా ఆ ఎఫెక్ట్ వస్తుందా? మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్లకు రావడం తగ్గించిన తరుణంలో ఇలాంటి సీక్వెల్‌కి ఆదరణ ఉంటుందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఇక ఎస్వీకృష్ణారెడ్డి ఫామ్ కోల్పోయి ఎంతో కాలం అయింది. నాడు అలీతో తీసిన మ్యాజిక్ మూవీ ‘యమగోల’కి ఆమధ్య ఆయన ‘యమగోల 2’ తీస్తే పట్టించుకున్న నాథుడే లేడు. దాంతో ఈ ‘శుభలగ్నం’ సీక్వెల్‌ని మాత్రం మంచి టాలెంట్ ఉన్న నవతరం దర్శకుని చేతిలో పెట్టాలని 70ఎంఎం అధినేతల ఆలోచనగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే కొంత కాలం ఓపిక పట్టాల్సిందే.