డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా అనేది టీం వర్క్, దర్శకుడి మనోభావాలకు తగ్గ సాంకేతిక నిపుణులు కూడా ఇందులో కీలకపాత్రను పోషిస్తారు. ముఖ్యంగా ఓ దర్శకుడికి తన టీంలో దర్శకత్వ శాఖలో పనిచేసే కోడైరెక్టర్లు, అసోసియేట్స్, అసిస్టెంట్స్ వంటి వారు చాలా ముఖ్యం. వీరిది దర్శకుని జయాపజయాలలో కీలకమైన స్థానం. నేడు ఎక్కువగా దర్శకుడు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, డైలాగ్స్.. ఇలా అన్నింటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అలాంటి సమయంలో దర్శకుని అభిప్రాయాలకు అనుగుణంగా సరైన అవుట్‌పుట్ ఇవ్వడంలో సహాయక దర్శకత్వ సిబ్బంది ఎంతో కీలకంగా మారుతారు.
ఇక పూరీ జగన్నాథ్‌కి కెరీర్ మొదటి స్టేజీలో పరుశురాం నుంచి అనేక మంది మంచి అసిస్టెంట్స్ ఉండేవారు. కానీ వారందరు సొంతగా డైరెక్టర్స్‌గా మారిన తర్వాత పూరీకి గడ్డు పరిస్థితులు వచ్చాయి. అంతటి టాలెంట్ ఉన్న సహాయక దర్శక, రచయితలు పూరీకి మరలా దొరకలేదు. ఉన్న కొద్ది మంది కూడా చార్మి ఆగడాలు భరించలేక బయటకి వచ్చారనే విమర్శ ఉంది. ఇక సుకుమార్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆయన తాను నిర్మించే చిత్రాల ద్వారానే ఎంతో టాలెంట్ ఉన్న తన అసిస్టెంట్స్‌ని డైరెక్టర్స్ చేస్తున్నాడు. తన శిష్యులు సొంతగా దర్శకులుగా సక్సెస్ సాధించడం సంతోషించే విషయమే అయినా అంత మంచి వారిని పోగొట్టుకోవడం మరోవైపు బాధించే విషయమే. ఇలా అసిస్టెంట్స్ డైరెక్టర్స్‌గా మారుతూ ఉండటం వల్ల పూరీ, సుక్కులతో పాటు పలువురు స్టార్స్ సరైన ప్రత్యామ్నాయాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారట. పూరీ తన శిష్యులతో తన సోదరుడు సాయిరాంశంకర్, తనయుడు ఆకాష్‌పూరీ వంటి వారితో చిత్రాలు చేయిస్తున్నాడు.
మరోవైపు సుకుమార్ రైటింగ్స్ పేరుతో సుక్కు కూడా ఇప్పటికే సొంతగా ‘కుమారి 21ఎఫ్, దర్శకుడు’ చిత్రాలు తీశాడు. ప్రస్తుతం బుచ్చిబాబుని దర్శకునిగా పరిచయం చేస్తే వైష్ణవ్‌తేజ్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో మైత్రి మూవీమేకర్స్ కూడా భాగస్వామిగా ఉంది. త్వరలో నాగశౌర్య హీరోగా, శరత్‌మరార్ భాగస్వామ్యంలో మరో చిత్రం చేయనున్నాడు. హరీష్‌శంకర్ కూడా ప్రస్తుతం ఇదే ఫాలో అవుతున్నాడు. త్వరలో ఆయన ఈస్ట్‌కోస్ట్ సంస్థ అధినేత మహేష్ కోనేరుతో వరుస చిత్రాలను నిర్మిస్తూ, తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేయనున్నాడు. మొత్తానికి తమ శిష్యులు దర్శకులుగా హిట్ అయితే ఓ కంట పన్నీరు, మంచి అసిస్టెంట్ పోయినందుకు ఓ కంట కన్నీరు పెట్టుకోవడం అంటే ఇదేనేమో అనిపించకమానదు.