రామ్ గోపాల్ వర్మ అనుకున్నంత చేసాడు. చంద్రబాబుకి స్పాట్ పెట్టేసాడు. ఇప్పటివరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ టైటిల్‌తోనూ, ఆ సినిమాలోని కేరెక్టర్స్‌తో అందరిని హడలెత్తించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌తో బాబు గుండెల్లో గురి చూసి బాణం వదిలాడు. అంతేనా నందమూరి ఫ్యామిలీని కూడా కెలికేశాడు. కానీ మోహన్ బాబుని మాత్రం చాలా పాజిటివ్ యాంగిల్ లో చూపించాడు. అలాగే ఎన్టీఆర్ మాత్రం తన పెద్దల్లుడు చంద్రబాబు వలన ఎంతగా క్షోభ పడ్డాడో ఈ ట్రైలర్‌లో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. మరి ఆర్జీవీ చేసిన ఈ పనిని టిడిపి శ్రేణులు, నందమూరి, నారా ఫ్యామిలీలు ఎలా తీసుకుంటాయో వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా ఉంది.
ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ లోకి వెలితే... రామ రామ రామ అంటూ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ‘నమ్మితేనే కదా మోసం చేసేది అనే అడవి రాముడు డైలాగ్’ని స్క్రీన్ మీద చూపిస్తూ... 1989 ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన రోజులవి అని అక్షర రూపంలో చూపిస్తూ... రామ రామ రామ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్టీఆర్ ని కుటుంబ సభ్యులు ఒంటరి వాడినిచేసి వెళ్ళిపోయినప్పుడు.. ఒంటరిగా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉండే.. ఎన్టీఆర్ కి ఒకరోజు వర్షంలో హఠాత్తుగా... ‘స్వామి మీతో ఫోన్ మాట్లాడిన... లక్ష్మి పార్వతి నేనే అంటూ’.. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించడం... ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ కి లక్ష్మి పార్వతి తోడవడం... ఎన్టీఆర్ కి సపర్యలు చెయ్యడంతో.. బయట అంతా లక్ష్మి పార్వతిని ఉద్దేశించి ‘రాత్రుళ్లు కూడా అక్కడే ఉంటోందట’ అన్న డైలాగ్ బ్యాగ్రౌండ్‌లో వినబడుతుంది.
ఇక మోహన్ బాబు పాత్రని పాజిటివ్ గా లక్ష్మి పార్వతికి, ఎన్టీఆర్‌కి అనుకూలంగా చూపిస్తూ ‘హ్యాట్సాఫ్ చాలా గొప్పగా చెప్పారు’ అని మోహన్ బాబు కేరెక్టర్ చేత చెప్పించడం, ‘ఈవిడ పేరు లక్ష్మీపార్వతి... మా జీవిత చరిత్ర రాస్తున్నారు’ అంటూ టిడిపి శ్రేణులకు, ఎన్టీఆర్ పెద్దల్లుడు చంద్రబాబునాయుడికి పరిచయం చెయ్యడం, ఎన్టీఆర్ మీద లక్ష్మి పార్వతి మీద పేపర్‌లో అసభ్యంగా వార్తలు రావడంతో.. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్‌ని ఉద్దేశించి ఏమిటిది స్వామి అంటూ నిలదియ్యడం, ప్రెస్ ని ఉద్దేశించి ఎన్టీఆర్ ‘శారీరక సుఖం కోసమో... ఇంకేదో వ్యక్తిగతమైన ప్రోద్బలం కోసమో’ అని చెప్పడం, ఇక చంద్రబాబు వాయిస్‌తో బ్యాక్‌రౌండ్‌లో ‘దానికిగాని కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్ అంటూ’ నందమూరి ఫ్యామిలీకి హిత బోధ చేసే డైలాగ్స్, ఇక ఎన్టీఆర్ కూడా లక్ష్మి పార్వతిని రాజకీయాల్లోకి తనకి తోడుగా తీసుకురావడం, ఆమెని పెళ్లి చేసుకున్న సందర్భం, అలాగే వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన సన్నివేశాలను చూపించిన వర్మ.. చివరిలో ఎన్టీఆర్, చంద్రబాబు వలన ఎంతగా క్షోభ అనుభవించాడనేది.. ‘నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నమ్మడమే’ అంటూ చంద్రబాబుని ఉద్దేశించి చెప్పే ఒకే ఒక్క డైలాగ్‌తో ముగించేశాడు.
మరి ఎన్టీఆర్.. లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరమవడం, చంద్రబాబు వెన్నుపోటు, ఎన్టీఆర్ కూతుళ్లు, కొడుకుల నుండి ధిక్కారం, ఎన్టీఆర్ రాజకీయాలలో పడిన ఒడిదుడుకులు అన్ని రామ్ గోపాల్ వర్మ ఒకే ఒక్క ట్రైలర్ లో చూపించేసాడు. మరి వర్మ ఇప్పుడు ట్రైలర్ తోనే ఇంతగా సెన్సేషన్ సృష్టిస్తే... రేపు సినిమాతో మరెంత సెన్సేషన్‌కి శ్రీకారం చుడతాడో కానీ.. చంద్రబాబు ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ చూసాక రామ(ము) జపం చెయ్యక తప్పదు.