నిర్మాతగా, పంపిణీదారునిగా, సినీ ఇండస్ట్రీ మీద మంచి అవగాహన, కథలు, డైరెక్టర్ల ఎంపిక వంటి విషయాలలో బాగా అనుభవం సంపాదించిన నిర్మాత దిల్‌రాజు. తాజాగా ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలపై లోతుగా స్పందించాడు. నైజాం, ఆంధ్రా ఏరియాల మధ్య తేడాలను గూర్చి ఆయన మాట్లాడుతూ, ఆంధ్రాలో ఉదయం 6గంటలకే బెనిఫిట్ షో వేసినా ఉపయోగం ఉండదు. అంత తెల్లవారుజామున సినిమా థియేటర్ల వద్దకు వెళ్లి సినిమా చూడటానికి నైజాం ప్రేక్షకులు ఆసక్తి చూపించరు. ఎంతటి పెద్ద స్టార్ పరిస్థితి అయినా ఇంతే. ఏదో హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లు, ఖమ్మంలోని ఒకటి రెండు థియేటర్లు మాత్రమే దీనికి మినహాయింపు.
కానీ ఆంధ్రాలో బెనిఫిట్ షోలు వేస్తే మంచి కలెక్షన్లు వస్తాయని పేర్కొన్నాడు. దాసరి గారు బతికున్నంత వరకు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా పిలిపించి మాట్లాడి పరిష్కారం చేసేవారు. కానీ నేడు ఆయన పోయిన తర్వాత ఏ సమస్యపై ఎవ్వరూ స్పందించడం లేదు. ఇక చాలామంది చిన్ననిర్మాతలు తమ చిత్రాలకు థియేటర్లు ఇవ్వడం లేదని, కేవలం ‘ఆ..నలుగురు’ చేతిలోనే థియేటర్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నేను-అల్లుఅరవింద్-ఏషియన్ సునీల్-సురేష్‌బాబుల చేతిలో ఎక్కువగా థియేటర్లు ఉన్న మాట నిజమే. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే మొదటిరోజు తక్కువ థియేటర్లలో విడుదలైనా, పాజిటివ్ టాక్ వస్తే రెండో రోజు నుంచే థియేటర్లను పెంచుతున్నాం. కంటెంట్ లేకుండా వందల థియేటర్లు కావాలంటే ఎలా? ముందుగా మంచి సినిమాలు తీయడం. థియేటర్లు వాటికవే లభిస్తాయి.
ఇక మల్టీప్లెక్స్‌లు ముంబై నుంచి ఆపరేట్ అవుతున్నాయి. మరి చిన్ననిర్మాతలు థియేటర్లు కావాలని మల్టీప్లెక్స్ వారిని డిమాండ్ చేయగలరా? చిన్న చిత్రాలకు అన్‌సీజన్‌గా చెప్పుకునే ఫిబ్రవరి, మార్చి, జూన్, జులైలు మంచి అవకాశం. అంతేగానీ భారీ పోటీ ఉండే సంక్రాంతి, దసరా, వేసవి సీజన్లలో విడుదల చేయాలని భావిస్తే ఎలా? ఆ నాలుగు నెలలు మాకు థియేటర్లను మెయిన్‌టెయిన్ చేయడమే కష్టమైపోతోంది. థియేటర్ల యాజమాన్యాలు తాము థియేటర్లను నడుపలేక లీజ్‌లకి ఇస్తున్నాయి. ఇటీవల ‘హుషారు’ చిత్రం విషయంలో సమస్య వస్తే నేనే పరిష్కరించాను. బాగా ఉండే మంచి చిన్న చిత్రాలకు నావంతు సాయం ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దిల్‌రాజు మాటల్లో కూడా ఓ కోణంలో నిజం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.