ఒకవైపు నందమూరి, నారా వారి అభిమానులు స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగమైన ‘కథానాయకుడు’ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. దాంతో ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలని భావించిన దీని సీక్వెల్ ‘మహానాయకుడు’ వాయిదా పడింది. బ్యాలెన్స్ ఉన్న సన్నివేశాలతో పాటు కొన్ని ముఖ్యమైన సీన్స్‌ని మరలా రీషూట్ చేశారు. ఈనెల 22న విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే ప్రతి విషయాన్ని తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి ముడిపెట్టి రాంగోపాల్‌వర్మ దూకుడు పెంచాడు.
ఇక ‘కథానాయకుడు’ అయితే ఆయనకు కోతికి కొబ్బరిచిప్ప లభించినంతగా లాభించింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్‌ని బాగా వాడుకుంటున్నాడు. ఇక ‘మహానాయకుడు’ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది అనే విషయం తన చెవిని పడిన వెంటనే తాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేస్తానని ప్రకటించాడు. తాజాగా ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్‌ని ‘మహానాయకుడు’ విడుదల కానున్న ఫిబ్రవరి 22నే ఉదయాన్నే విడుదల చేస్తానని ప్రకటించాడు. ‘మహానాయకుడు’ విడుదలైన థియేటర్లలో ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్‌ని చూడవచ్చని, ‘మహానాయకుడు’ టిక్కెట్ కొని లక్ష్మీస్‌ఎన్టీఆర్ థియేటికల్ ట్రైలర్ చూసే మహదవకాశాన్ని వదులుకోవద్దంటున్నాడు.
ఇక ఈయన తాజాగా శత్రువుకి శత్రువు మిత్రుడన్న పాలసీని పాటించాడు. వైఎస్‌రాజశేఖర్ రెడ్డి సెమీ బయోపిక్‌గా రూపొందిన ‘యాత్ర’ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన మాట్లాడుతూ, ‘యాత్ర ఒక అద్భుతమైన చిత్రం. ఒక గొప్పనాయకుడిని ఎంతో గొప్పగా చూపించారు దర్శకుడు మహి.వి.రాఘవ ఆ మహానాయకుడిని మరలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకుని వచ్చారు. మమ్ముట్టి గారికి, మహి.వి.రాఘవ గారికి అభినందనలు’ అని తెలిపాడు..!
ఇక ‘యాత్ర’ విషయానికి వస్తే ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటి భాగం ‘కథానాయకుడు’ని విపరీతంగా మెచ్చుకున్న సినీ ప్రముఖులు ‘యాత్ర’పై మాత్రం పెద్దగా పెదవి విప్పడం లేదు. బహుశా దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. వైఎస్‌కి వీరాభిమానులైన కోలీవుడ్ స్టార్ సూర్య, సురేందర్‌రెడ్డి, రఘుకుంచె, మారుతి వంటి వారు మాత్రమే ఇప్పటికీ స్పందించారు. మరి సినీ ప్రముఖులు ‘యాత్ర’ని పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటనే చర్చ బాగా అవుతోందనే చెప్పాలి..!