స్వర్గీయ ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ప్రతి ఎన్నికల సమయంలో ముందుకు వస్తుంది. ఆయనకు ఇవ్వకపోవడం అన్యాయమని బాబు అండ్ కో అంటారు. కానీ దేవగౌడ, వాజ్‌పేయ్‌ల హయంలో చంద్రబాబు హవా కేంద్రంలో కూడా సాగింది. నాడు చంద్రబాబు చిత్తశుద్దిగా ప్రయత్నించి ఉంటే భారతరత్న వచ్చేది. ఇక మోదీతో కూడా నాలుగేళ్లు కాపురం చేశాడు. నాడైనా ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీనిపై ఎంతో కాలం ముందే ‘సినీజోష్’ ఓ విశ్లేషణ ఇచ్చింది. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే అది చట్టపరంగా ఆయన రెండో భార్య అయిన లక్ష్మీపార్వతికి ఇవ్వాల్సివుంటుంది. అది నందమూరి, నారా వారికి ఇబ్బంది. కాబట్టే చంద్రబాబు దానిపై చిత్తశుద్ది చూపించడం లేదని తెలిపింది. తాజాగా తమ్మారెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కానీ ఇక్కడ మరో లాజిక్ కూడా ఉంది. చంద్రబాబు హవా పోయిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, కేంద్రంలో మన్మోహన్‌సింగ్‌ల యూపీఏ రెండు సార్లు అధికారంలో ఉంది. ఎన్టీఆర్‌కి బతికున్నప్పుడు తిట్టిన వారే నేడు ఆయన పేరుపై రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో నారా చంద్రబాబునాయుడుతో పాటు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, జగన్ వంటి వారు కూడా ముఖ్యులు. ఇటీవల మోదీకి కూడా చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన సంగతి గుర్తుకొచ్చింది. వైసీపీ నాయకులు కూడా తరచుగా ఎన్టీఆర్ గొప్పవాడు.. చంద్రబాబే వెన్నుపోటు పొడిచాడని అంటున్నారు.
మరి కాంగ్రెస్ హయాంలో గానీ లేదా నేడు టిడిపికి, మోదీకి భగ్గుమంటున్న తరుణంలో వైసీపీ బిజెపికి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో జగన్, మోదీలు కలిసి ఎన్టీఆర్‌కి భారతరత్న ఇచ్చి, లక్ష్మీపార్వతి చేతికి అందించవచ్చు కదా. తద్వారా ఎన్టీఆర్ అభిమానులను, తెలుగుజాతిని ఉద్దరించామని మోదీ, జగన్‌లు ప్రచారం చేసుకునే వీలుండేది కదా...! అందునా ఇప్పుడు పురంధరేశ్వరి బిజెపిలో, ఆమె కుమారుడు వైసీపీలో, లక్ష్మీపార్వతి కూడా వైసీపీలోనే ఉన్నారు కదా...! మరి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి మోదీ, జగన్‌ల వరకు ఈ అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేదనే అనుమానం రాకమానదు.