వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్‌వర్మ. ఈయన ఈమధ్య ఏమాత్రం కంటెంట్ లేని చిత్రాలు తీస్తున్నా కూడా ప్రమోషన్లు, రెండు రోజులు థియేటర్‌లో ఆడినా లాభాలు సాధించడం ఎలా? వరుస చిత్రాలను తీయడం ఎలా? అనే విషయాలలో పీహెచ్‌డి చేశాడు. ఎవ్వరూ టచ్ చేయలేని ‘పరిటాల రవి, వంగవీటి, వీరప్పన్, దావూద్ ఇబ్రహీం, బాల్‌థాక్రే’ ఇలా ఎన్నో నిజజీవిత పాత్రలను తెరపైన చూపించాడు. కానీ ఆయన ఏనాడు పూర్తిగా సెన్సార్ చిక్కుల్లో పడలేదు. పడినా వాటిని తన తెలివితో ‘యద్దార్ధ సంఘటనలతో కూడిన కల్పితకథ’ అనో.. ఈ చిత్రంలోని పాత్రలు ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు అనో, లేదా ఫలానా వ్యక్తి పేరుకి అదే సౌండింగ్ వచ్చే పేరును పెట్టడం ద్వారా జిమ్మిక్కులు చేస్తున్నాడు.
ఇక ఈయన ప్రస్తుతం ‘కథానాయకుడు’ డిజాస్టర్ అయిన నేపధ్యంలో తన స్వరం పెంచాడు. ‘గర్జన సింహగర్జన’ అనే సాంగ్ రికార్డింగ్ వీడియోని సోషల్‌మీడియాలో పెట్టాడు. ఈ పాటని సిరాశ్రీ రాయగా, సాయికుమార్ బ్రదర్, డబ్బింగ్‌లో మెగాస్టార్ వంటి రవిశంకర్‌తో ఈ పాట పాడించాడు. అంతేకాదు.. రవిశంకర్ కంచుకంఠం స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కి కూడా వినిపిస్తుందని అన్నాడు. ఇక ఈ చిత్రం విడుదల కాకుండా ఎలా చేయాలా? అసలు వర్మతో వివాదం ఏమిటా? అనే విషయంలో నందమూరి, నారా ఫ్యామిలీలు ఆందోళనలో ఉన్నాయి.
ఓవైపు ‘కథానాయకుడు’ వంటి ఊహకందని షాకిచ్చే డిజాస్టర్, ఇంకోవైపు ‘మహానాయకుడు’ టెన్షన్, మరోవైపు వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా కనిపిస్తోంది. వర్మ కూడా ఎంతో తెలివిగా ఈ చిత్రం రిలీజ్‌ను దాచిపెడుతూ గేమ్ ఆడుతున్నాడు. ప్రేమికుల రోజున ట్రైలర్ సరే.. విడుదల తేదీ మాత్రం చెప్పడం లేదు. ఎందుకంటే వెంటనే విడుదల చేస్తే శాంతిభద్రతల నెపంతో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో విడుదల కాకుండా అడ్డుకునే వీలుంది. కానీ తెలంగాణలో ఆ సమస్య లేదు. అంతేకాదు.. ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో ఈ చిత్రం విడుదలైతే ఎవ్వరూ ఆపే చాన్స్ కూడా ఉండకపోవచ్చు.
మరి నందమూరి, నారా ఫ్యామిలీలు కోర్టుకి వెళ్లితే ‘లక్ష్మీపార్వతి పేరుతో ఎందరో ఉన్నారు. ఎన్.టి.ఆర్. అంటే నందమూరి తారకరామారావు అనే ఎందుకు అనుకోవాలి? అని వాదించి ‘యన్’, ‘టి’, ‘ఆర్’లకు కలిసొచ్చేలా ఎన్టీరామారావు సౌండింగ్‌తోనే మరో పేరును వాడుకునే అవకాశం ఉంది. అందునా ఇటువంటి విషయాలలో వర్మ దిట్ట. మరి రాబోయే రోజుల్లో వర్మ, నందమూరి, నారాల రాజకీయం ఎలా సాగనుందో వేచిచూడాలి..!