ఈ ఫిబ్రవరి బాక్సాఫీస్‌ను మరీ ఉసూరుమనిపించేస్తుంది. ఫిబ్రవరి 1 శుక్రవారం సోదిలో లేని సినిమాలు విడుదలైతే గత శుక్రవారం వైఎస్సార్ బయోపిక్ యాత్ర విడుదలైంది. కేవలం రాజకీయాలకు మాత్రమే సంబందించిన ఈసినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను తృప్తి పర్చలేకపోయింది. ఇక యాత్ర సినిమాతో పాటుగా అమావాస్య, విచారం అంటూ ఊరు పేరు లేని సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. కాస్త యాత్రనే బెటర్ అనేలా ఉంది. ఇక ఈ శుక్రవారం ఒక్క తెలుగు సినిమా కూడా విడుదలయ్యే సినిమాల లిస్ట్ లో లేదు. ఫిబ్రవరి 14 న రెండు డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు బాక్సాఫీసు మీద దాడికి దిగుతున్నాయి.
తెలుగు సినిమాలేవీ విడుదలకాకపోవడం... ఆ సినిమాలకు అడ్వాంటేజ్ కానుంది. మలయాళం నుండి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన లవర్స్ డే సినిమా ఒకటి, మరొకటి కార్తీ, రకుల్ ప్రీత్ జంటగా నటించిన దేవ్ సినిమా ఒకటి ఈ 14 న థియేటర్స్ లోకి రాబోతున్నాయి. మరి ఈ రెండు డబ్బింగ్ సినిమాలకు ఎదురు నిలిచే ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం అనేది ఆ రెండు సినిమాలకు అడ్వాంటేజే. ఇక కన్ను గీటు తో గన్ పేల్చిసి తెగ పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ లవర్స్ డే మీద పెద్దగా అంచనాలు లేకపోయినా.... ఆ అమ్మాయి నటన, గ్లామర్ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంది. ఇక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పి ప్రస్తుతము అవకాశాలు లేక తమిళ, హిందీ సినిమాల్తో కెరీర్ ని లాక్కొస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, తెలుగులో కాస్తో కూస్తో మార్కెట్ సంపాదించిన కార్తీ జంటగా తెరకెక్కిన దేవ్ సినిమా మంచి అంచనాలే ఉన్నాయి.
కార్తీ ప్రతి సినిమా తెలుగులో డబ్ అవడం, హీరోయిన్ రకుల్ ప్రీత్ కావడంతో దేవ్ సినిమా మీద మంచి అంచనాలు, ప్రేక్షకులలో ఆసక్తి ఉన్నాయి. మరి తెలుగు సినిమాలు చేతులెత్తేసిన టైములో తమ ప్రతాపం చూపించడానికి ఈ రెండు డబ్బింగ్ సినిమాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక లవర్స్ డే ప్రమోషన్స్ కన్నా ఒకింత ఎక్కువగా దేవ్ ప్రమోషన్స్ ఉన్నాయి. మరి రకుల్ తెలుగు ఛానల్స్‌కి ఇంటర్వ్యూస్ గట్రా ఇస్తూ దేవ్ సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంది.