ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా థియేట్రికల్ బిజినెస్ 70 కోట్లకు జరిగితే.. డిస్ట్రిబ్యూటర్స్‌కి వచ్చింది కేవలం 20 కోట్లు మాత్రమే. మిగతా 50 కోట్ల నష్టాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు బయ్యర్లు చవిచూడాల్సి వచ్చింది. అయితే కథానాయకుడితో భారీగా నష్టపోయిన బయ్యర్లకు ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్ మహానాయకుడ్ని బాలకృష్ణ బ్యాచ్ ఫ్రీగా ఇస్తున్నారనే టాక్ ఇప్పటివరకు నడిచింది. కథానాయకుడుతో లాస్ అయిన బయ్యర్లకు మహానాయకుడుతో న్యాయం చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఇక ఈ ప్రచారానికి NBK ఫిలిమ్స్ నుండి, క్రిష్ నుండి కానీ క్లారిటీ రాకపోయేసరికి అందరూ మహానాయకుడు ఫ్రీగా ఇస్తున్నారనే ఫిక్స్ అయ్యారు.
కానీ మహానాయకుడ్ని కథానాయకుడు బయ్యర్లకు ఫ్రీగా ఇవ్వడం కాదు.. అసలా బయ్యర్లను పక్కనే బెట్టేసి కొత్తవారికి మహానాయకుడ్ని అమ్మే ఏర్పాట్లు మొదలయ్యాయని టాక్ నడుస్తుంది. అయితే కథానాయకుడు బయ్యర్లకు ఎంతో కొంత వెనక్కి ఇచ్చే ప్రాసెస్ స్టార్ట్ అయినట్లుగా చెబుతున్నారు. కథానాయకుడుతో నష్టపోయిన బయ్యర్లకు పెట్టుబడిలో 20 శాతం వెనక్కి ఇచ్చెయ్యడానికి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలు రెడీ అయ్యారట. అలాగే మహానాయకుడి థియేట్రికల్ రైట్స్ ని కొత్త బయ్యర్లకు కట్టబెట్టాలనే ఆలోచనలో మహానాయకుడు టీం ఉందట.
కానీ కథానాయకుడు బయ్యర్లు ఇది విన్న తర్వాత తమకి 20 శాతం వద్దని... మహానాయకుడు ఫ్రీగా ఇస్తే కొంతలో కొంత ఒడ్డెక్కుతామని అంటున్నారట. మాకు 20 శాతం ఇచ్చేసి చేతులు దులుపుకుంటే కుదరదని.. మహానాయకుడు మాకు ఫ్రీగా ఇవ్వాల్సిందే అంటూ ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల వెంట బయ్యర్లు పడుతున్నారట. మరి మార్కెట్ లో పెద్దగా క్రేజ్ లేని మహానాయకుడు ఫ్రీ గా ఇచ్చినా తమ నష్టాలూ పూడవని... ఏదో పెట్టిన పెట్టుబడిలో 20 శాతం ఇచ్చేసి ఊరుకుంటే కుదరదని వారు ఖరాఖండిగా చెబుతున్నారట. మరి ఈ ఎన్టీఆర్ బయోపిక్ బయ్యర్ల గోల రోడ్డెక్కేలా కనబడుతుందని ఫిలింనగర్ టాక్.