మనదేశం అటు క్యాపిటలిజం కాదు.. పూర్తిగా సోషలిజం కాదు.. మనది మధ్యేమార్గం. ఇలా అన్ని విషయాలలో, అన్నిరంగాలలో మధ్యేమార్గం అనేదే మంచిది. ఇక సినిమాల విషయంలో కూడా ఇదే సూత్రం పనికి వస్తుంది. కొందరు కేవలం పేరు తెచ్చుకుని, బాగా క్రేజ్, ఇమేజ్ ఉన్న స్టార్ దర్శకులతో మాత్రమే చిత్రాలు చేయాలని భావిస్తారు. అనుభవం ఉన్న వారైతేనే తమని సరిగా ఉపయోగించుకుంటారనే ఆలోచన ఉంటుంది. అదే సమయంలో సరికొత్త ఆలోచనలు, విభిన్న, వైవిధ్యభరితమైన కథలతో కొత్తదనం నింపుకున్న నవతరం దర్శకులు కూడా బాగానే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కాబట్టే మన హీరోలు కూడా మధ్యేమార్గంగా అటు సీనియర్లతో, ఇటు కొత్తవారితో కలిసి పయనం సాగించాలని భావిస్తుంటారు. నేచురల్‌స్టార్ నాని నుంచి మహేష్‌బాబు వరకు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు.
ఎందుకంటే పెద్ద దర్శకులు ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఒక సినిమా షూటింగ్ సమయంలోనే మరో రెండు మూడు కథలతో హీరోలను మెప్పించి లైన్‌లో పెట్టుకుంటారు. కాబట్టి వారితోనే పనిచేయాలంటే అది ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. కాబట్టి వారినే నమ్ముకుంటే ఏడాదికి ఒక చిత్రం చేయడమే గగనం అవుతుంది. ఈ విషయంలో ప్రభాస్‌నే తీసుకుంటే ఆయన కొరటాలశివ, వినాయక్, రాజమౌళి, పూరీ జగన్నాథ్ వంటి వారితో పాటు ప్రస్తుతం ఒకే చిత్రం అనుభవం ఉన్న సుజీత్, జిల్ రాధాకృష్ణలతో చిత్రాలు చేస్తున్నాడు. ఇక విషయానికి వస్తే అక్కినేని చిన్నబ్బాయ్ అఖిల్ తన మొదటి రెండు చిత్రాలను ప్రూవ్‌డ్ డైరెక్టర్స్ అయిన వినాయక్, విక్రమ్ కె.కుమార్‌లతో చేశాడు. ఆ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో నవతరం దర్శకుడయిన వెంకీ అట్లూరితో ‘మిస్టర్ మజ్ను’ చేశాడు. కానీ ఎవ్వరు ఆయనకు కనీస హిట్‌ని అందించలేదు.
ఇదే సమయంలో అఖిల్.. సత్య పినిశెట్టి అనే నవరతం దర్శకునితో నాలుగో చిత్రం చేయనున్నాడని, దీనికి నాగార్జుననే నిర్మాత అని వార్తలు వచ్చాయి. కానీ ఇది ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. అఖిల్ మాత్రం కేవలం టాప్‌డైరెక్టర్స్‌తో తదుపరి చిత్రం చేయాలని ఆశిస్తున్నాడట. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ నుంచి కొరటాల శివ వరకు టాప్ డైరెక్టర్స్ అందరు బిజీబిజీగా ఉన్నారు. వారి చేతుల్లో మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయి. కాబట్టి అఖిల్ మధ్యేమార్గంగా అటు టాప్ దర్శకులతో అవకాశం ఉన్నప్పుడు చేస్తూ, వారు బిజీగా ఉన్న సమయంలో యంగ్ డైరెక్టర్స్‌ని చాన్స్ ఇస్తేనే వరుస చిత్రాలు చేసి, ఏదో ఒక హిట్‌ని తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.