ఒకనాడు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఇద్దరు ఏకైక దక్షిణాది స్టార్స్‌గా కమల్‌హాసన్, రజనీకాంత్‌లను చెప్పుకునేవారు. వారికి అన్ని భాషల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. వారి చిత్రాలు మాత్రమే ఇతర భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యేవి. అలా లోకనాయకుడుగా కమల్, ఇండియన్ సూపర్‌స్టార్‌గా రజనీకాంత్ తమ సత్తా చాటారు. కానీ వారి కెరీర్లు ప్రస్తుతం చరమాంకానికి వచ్చాయి. ఈ సమయంలో ఆచితూచి సినిమాలు చేసి, తమకున్న గొప్ప పేరుని నిలబెట్టుకోవాలే గానీ నవ్వుల పాలు కాకూడదు.
ఇక రజనీ ఈ మధ్య తీసిన ‘కబాలి, కాలా, పేట’ వంటి చిత్రాలు తమిళనాట మినహా పెద్దగా ఎక్కడా ఆడలేదు. ఇందులో రజనీ మార్క్ ఉన్నా కూడా అవి తమిళ నేటివిటీతో నిండిపోయి ఉసూరుమనిపించాయి. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం సమంజసమే గానీ ఏదో చేశామంటే చేశామన్నట్లుగా కథలను, దర్శకులను ఎంపిక చేసుకోవడం, యూనివర్శల్ అప్పీలు ఉన్న వారిద్దరు అలాంటి సబ్జెక్ట్స్‌ను ఎంచుకోలేకపోతూ ఉండటం బాధాకరం. ఇక ఇద్దరికి తమ కెరీర్ పూర్తి కావచ్చిందని తెలుసు. అందుకే ప్రత్యామ్నాయంగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇక కమల్‌హాసన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయన ఏదైనా చిత్రం ప్రారంభించాడంటే అది షూటింగ్ జరుగుతోందా? ఆగిపోయిందా? అనే అనుమానాలే ఎక్కువగా వస్తున్నాయి. ఎంతో ఆర్బాటంగా బ్రిటిష్ రాణిని పిలిచి ప్రారంభించిన ‘మరుదనాయగం’ నుంచి ‘విశ్వరూపం2’, ‘శభాష్ నాయుడు’ వరకు ఇదే వరస. ఇక కమల్‌హాసన్ ఆస్థులు ఎంత అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. 60ఏళ్ల సినీ ప్రస్థానం, అందునా మూడు దశాబ్దాలు పాటు లోకనాయకునిగా వెలిగిన కమల్ ‘విశ్వరూపం’తో సహా పలు చిత్రాల వల్ల ఆర్ధికంగా బాగా నష్టపోయాడు. కమల్‌హాసన్ ఆస్తుల విలువను లెక్కిస్తే అవి కేవలం 20, 25 చిత్రాలు చేసిన యంగ్‌స్టార్ అస్థులకు మాత్రమే సమానంగా ఉండటం గమనించవచ్చు.
ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ ‘భారతీయుడు2’ చేస్తున్నాడు. ఒకవైపు షూటింగ్‌లను ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియని శంకర్, మరోవైపు సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో కూడా తెలియని కమల్‌హాసన్‌లు ఉండటంతో ఈ చిత్రం షూటింగ్ పొలాచ్చిలో జరుగుతూ సెట్ బాగా లేదని ఆపేశారని వార్తలు వచ్చాయి. దాంతో శంకర్, కమల్‌ల నైజం తెలిసిన అందరూ ఇది నిజమేనని నమ్మారు.
కానీ తాజాగా కమల్‌హాసన్ ఈ వార్తలను కొట్టి పడేశాడు. షూటింగ్ బాగా జరుగుతోందని, శంకర్ అద్భుతంగా తీస్తున్నాడని వివరణ ఇచ్చాడు. ఇక పొలాచ్చిలో వేసిన ఇంటి మండువా సెట్ ‘భారతీయుడు’లోని సెట్‌ని గుర్తుకు తెస్తోందనే చెప్పాలి. ఇందులో ఆర్యతో పాటు తెలుగు కమెడియన్ వెన్నెల కిషోర్‌లు కూడా నటిస్తున్నారని అంటున్నారు. ఆర్య సరే.. వెన్నెలకిషోర్ ఇందులో నటిస్తున్నాడా? లేదా ? అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.