90స్ లో విలన్‌గా పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆరడుగుల మహేష్ ఆనంద్(57) ఈ రోజు (శనివారం) మృతి చెందారు. ముంబైలోని అతని ఫ్లాట్‌లో చనిపోయి కనిపించడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. సూసైడ్‌గా అనుమానిస్తున్నా ముంబై పోలీసులు మాత్రం ఇంకా ఎలాంటి నిర్థారణ చేయలేకపోతున్నారు. అతని ఇంటి ఆవరణలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, ప్రస్తుతం అతని బాడీని ముంబైలోని కాపర్ హాస్పటల్‌కు పోస్టు మార్టమ్ కోసం తరలించారని ముంబై సినీ వర్గాల సమాచారం.
మహేష్ ఆనంద్ దాదాపు 18 ఏళ్ల విరామం తరువాత నటించిన చివరి చిత్రం `రంగీలా రాజా`. గోవిందా నటించిన ఈ సినిమా గత నెల 18న విడుదలైంది. 90లలో `షెహెన్‌షా` సినిమాతో కెరీర్ ప్రారంభించిన మహేష్ ఆనంద్ ఆ తరువాత కూలీ నం.1, స్వర్గ్, కురక్షేత్ర, విజేత వంటి బాలీవుడ్ చిత్రాల్లో అమితాబ్ బచ్చన్, గోవిందా, సంజయ్ దత్, సన్నిడియోల్, ధర్మేంద్ర వంటి హీరోలతో నటించారు. చిరంజీవి నటించిన `లంకేశ్వరుడు` సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన మహేష్ ఆనంద్ ఆ తరువాత ఎస్వీకృష్ణారెడ్డి రూపొందించిన `నెంబర్ వన్`, `గన్‌షాట్`, పవన్‌కల్యాణ్ నటించింన `బాలు`తదితర చిత్రాల్లో కనిపించారు.