టాలీవుడ్‌లో నందమూరి, మెగా ఫ్యామిలీల తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఉన్నారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లతో పాటు సుమంత్, సుశాంత్‌లు అదనం. ఇక నాగార్జున, చైతు, అఖిల్‌ల విషయానికి వస్తే వీరు ఇక నుంచి ప్రతి ఏడాది మంచి సీజన్లుగా పేరు పొందిన సంక్రాంతి, వేసవి, దసరాలకు తమ నుంచి ఒక్కో చిత్రం విడులయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున త్వరలో ‘బంగార్రాజు, మన్మథుడు 2’ చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగేవే కావడం గమనార్హం. మరో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్‌కి ఈ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌ని అందించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్2’తో నాగార్జున కూడా ఇకపై మంచి కామెడీ ఎంటర్‌టైనర్స్ మీదనే దృష్టిపెట్టాలనే నిర్ణయానికి వచ్చాడట. ‘బంగార్రాజు’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక నాగచైతన్య విషయానికి వస్తే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తర్వాత వచ్చిన ‘యుద్దం శరణం, శైలజరెడ్డి అల్లుడు, సవ్యసాచి’ నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఆయన శివనిర్వాణ దర్శకత్వంలో పెళ్లయిన తర్వాత మొదటి సారిగా తన శ్రీమతి సమంతతో కలిసి ‘మజిలి’లో నటిస్తున్నాడు. ఈ ఏడాది వేసవి కానుకగా ఇది విడుదల కానుంది. మరోవైపు మేనమామ విక్టరీ వెంకటేష్‌తో, నాగచైతన్య కలిసి నటించే బాబి చిత్రం ‘వెంకీ మామా’ ప్రారంభం కానుంది. తన తదుపరి చిత్రంగా యు.వి.క్రియేషన్స్ బేనర్‌లో జాతీయ అవార్డు గ్రహీత, ‘చందమామ కథలు, గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడ వేగ’ వంటి విభిన్న చిత్రాలను తీసిన ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో నటించే చిత్రం ప్రారంభం కానుంది.
ఆ వెంటనే నాగార్జున ప్రాణస్నేహితుడైన శివప్రసాద్‌రెడ్డికి చెందిన కామాక్షి బేనర్‌లో మరో చిత్రం, దిల్‌రాజు బేనర్‌లో ‘జోష్’ తర్వాత మరో చిత్రం, నాగార్జున హీరోగా వచ్చిన ‘రాజన్న’ చిత్ర దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఇంకో చిత్రానికి ఓకే చెప్పాడు. అఖిల్ విషయానికి వస్తే ‘మిస్టర్ మజ్ను’ తర్వాత ఆయన ‘మలుపు’ చిత్ర దర్శకుడు సత్య పినిశెట్టి దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత క్రిష్‌తో మరో చిత్రం చేయనున్నాడు. ముందుగా సత్యపినిశెట్టి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి నాగార్జున ఆయన కుమారులైన నాగచైతన్య, అఖిల్‌లు ప్రతి ఏడాది ఒక్కో చిత్రం చొప్పున మూడు చిత్రాలతో మూడు భారీ సీజన్లను టార్గెట్ చేయడానికి రెడీ అవుతుండటం విశేషం..!