ఒకనాడు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో ఠాకూర్లు, యాదవులు.. ఇలా కులాల మధ్య పోరు కనిపించేది. కానీ నేడు తెలంగాణలో పరిస్థితి ఫర్వాలేదు గానీ ఏపీ మాత్రం కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. చంద్రబాబు అంటే కమ్మ.. జగన్ అంటే రెడ్డి... పవన్ అంటే కాపుల కింద ప్రజలు విడిపోవడం చూస్తుంటే నిజమైన ప్రజాస్వామ్య వాదులకు కన్నీరు రాకమానవు. తాజాగా ఇదే కులరాజకీయాలపై లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్‌నారాయణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మీ ప్రాణం విషమ పరిస్థితుల్లో ఉంటే మా కులం వాడు అని చేతగాని మీకులం డాక్టర్ వద్దకు తీసుకెళ్తారా? లేక వేరే కులం వాడైనా సరే మంచి డాక్టర్ వద్దకు తీసుకెళ్తారా? అని మండిపడ్డాడు.
కానీ ఇలాంటి వారి మాటలు అరణ్యరోధనే అవుతున్నాయి. నిజానికి ఏపీలో రెడ్డి, కమ్మ, కాపులదే ఆధిపత్యంగా మారింది. పవన్, చంద్రబాబు వంటి వారికి కులపిచ్చి ఉందో లేదో గానీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం కులాల వారిగా చీలిపోతున్నారు. వీరిని నాయకులు నియంత్రించడం లేదంటే అందులో తలాపాపం తిలా పిడికెడు ఉందనేది సత్యం. కార్యకర్తలను, అభిమానులను క్రమశిక్షణతో నియంత్రించలేని నాయకులు అసలు నాయకులు ఎలా అవుతారు? అనేది చాలా బాధాకరమైన ప్రభావం. తాను రెడ్డిని కాబట్టే తన రక్తంలోని కణకణం సేవాభావంతో ఉందని రెడ్లు, తాము కమ్మ కాబట్టే తమ రక్త కణాలలో అణువణువు క్రమశిక్షణ ఉందని కమ్మవారు చెబుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో హోరెత్తిస్తున్నాయి.
ఇక తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ఏపీ రాష్ట్రం చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్.. ఈ ముగ్గురి మీదే ఆధారపడి ఉంది. ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు రాష్ట్రాన్ని ఏలబోతున్నారు. ఈ ముగ్గురి మీద రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఏపీకి జరిగిన అన్యాయంపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే జనసేన, వైసీపీలు హాజరుకాలేదు. కనీసం మూడు పార్టీల వారు కలిసి చర్చిస్తే ఎవరి అభిప్రాయం ఏమిటి? అనేది తెలుస్తుంది. ఎవరు పిలిచినా అంటీ ముట్లనట్లు కూర్చోవడం సరికాదు. అందరు ఒకే వేదికపైకి వచ్చి వారి వారి అభిప్రాయాలను చెప్పాలి. వెలివేయాల్సిన బిజెపి వారిని కూడా ఉండవల్లి తన కార్యక్రమానికి పిలిచారు. అది ఆయన సంస్కారం అని తెలిపాడు.
నిజంగా తమ్మారెడ్డి మాటల్లో నిజం ఉంది. అభివృద్ది చెందిన దేశాలలోలాగా కేవలం ఎన్నికల ప్రచారాలే కాకుండా పోటీలో ఉన్న సీఎం అభ్యర్ధులు ఒకే వేదికపైకి వచ్చి చర్చావేదికలకు నడుం బిగిస్తేనే ఎవరు ఏమిటి? ఎవరి విధానం ఏమిటి? అనే విషయంలో ఓటర్లకు కాస్త చైతన్యం వచ్చే వీలుంటుంది. కానీ ఇలా మన రాజకీయ నాయకుల నుంచి మనం ఆశించడం అత్యాశ తప్ప మరేమి కాదనేది వాస్తవం.