గతంలో ఓ సినిమా బ్లాక్‌బస్టర్ అయి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించినప్పుడు ఆయా నిర్మాతలు తమ చిత్రాలలో నటించిన హీరోలకు గిఫ్ట్‌లు ఇచ్చేవారు. ముఖ్యంగా శోభన్‌బాబు నటించిన ‘మహారాజు’ చిత్రం పెద్ద విజయం సాధించిన సందర్బంగా విజయబాపినీడు ఆ రోజుల్లోనే ఖరీదైన కారుని శోభన్‌బాబుకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. కానీ ఇప్పుడు ఇదే సీన్ రివర్స్ అవుతోంది. హీరోలకు నిర్మాతలు గిఫ్ట్ ఇచ్చే సంప్రదాయం పోయింది. బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా వస్తే హీరోలు, నిర్మాతలు ఆయా చిత్రాల దర్శకులకు గిఫ్ట్‌లు ఇచ్చే ట్రెండ్ వచ్చింది. దీనిని బట్టి చూస్తే దర్శకుల ప్రాధాన్యత పెరిగిందని, హీరోలకంటే దర్శకులను గౌరవించే సంప్రదాయం వచ్చిందని అర్ధమవుతోంది. నిజంగా ఇది మంచి పరిణామం.
ఎందుకంటే దాసరి చెప్పినట్లు దర్శకులు స్టార్స్‌ని తయారు చేయగలరు.. హీరోలకు హిట్స్ ఇవ్వగలరు. కానీ హీరోలు దర్శకులకు హిట్స్ ఇవ్వలేరు. వారు స్టార్ డైరెక్టర్లను తయారు చేయలేరనే వాదన నేడు నిజమవుతోంది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ల ప్రాముఖ్యత బాగా పెరుగుతోంది. బండ్లగణేష్ పూరీకి భారీ గిఫ్ట్ ఇవ్వడం నుంచి సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత సూర్య, అజిత్, ధనుష్ వంటి వారు యూనిట్ అందరికీ విందులు, గిఫ్ట్‌లు ఇస్తున్నారు.
తాజాగా ‘96’ సినిమా దర్శకుడు అయిన ప్రేమ్‌కుమార్‌కి హీరో విజయ్‌సేతుపతి ఖరీదైన టూ వీలర్‌ని బహుమతిగా ఇచ్చాడు. ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాల సమయంలో మహేష్‌బాబు కూడా దర్శకులకు ఖరీదైన వస్తువులు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతికి సైలెంట్ కిల్లర్‌గా వచ్చి విజేతగా నిలిచి, నిర్మాత దిల్‌రాజుకి కాసుల వర్షం కురిపించిన ‘ఎఫ్2’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి నిర్మాత దిల్ రాజు ఎంతో ఖరీదైన బిఎండబ్ల్యు కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సివుంది.
రూపాయికి ఐదు రూపాయల లాభాలు పొందిన దిల్ రాజు అనిల్ రావిపూడికి ఈ మాత్రం గుర్తింపునైనా ఇవ్వడం ఆనందించాల్సిన విషయమేనని చెప్పాలి.