కళాకారులకు తమదైన ఆలోచన, క్రియేటివిటీ ఉంటాయి. కొన్నిసార్లు అవి మంచిని చేస్తే మరికొన్ని సార్లు వివాదాలకు కారణం అవుతాయి. ఎప్పటినుంచో సినిమా రంగంలో ఇలాంటివి కామన్‌గా జరుగుతూ ఉండటం విశేషం. ‘మిస్సమ్మ’ చిత్రంలో మొదట సావిత్రి పాత్రకు భానుమతిని అనుకున్నారు. జమున పాత్రకి సావిత్రిని తీసుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్స్‌ల వల్ల భానుమతి వైదొలగడం, ఆమె స్థానానికి సావిత్రిని, సావిత్రి స్థానానికి జమునని తీసుకున్నారు. ఇక మురళీమోహన్, గిరిబాబుల విషయంలో కూడా మొదటి చిత్రంలో ఇదే రిపీట్ అయింది.
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌నే తీసుకుంటే తేజ తప్పుకోవడం క్రిష్ చేత ఆ స్థానాన్ని భర్తీ చేయడం జరిగింది. కానీ కొన్నిసార్లు మాత్రం ఇలాంటివి తీవ్ర దుమారాన్నే రేపుతాయి. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘మణికర్ణిక’ వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ చిత్రాన్ని 75శాతం తానే తీశానని, కానీ ప్యాచ్ వర్క్ మాత్రమే పూర్తి చేసిన కంగనా రౌనత్ తన పేరుని వేసుకుని, తనకి క్రెడిట్ ఇవ్వలేదని క్రిష్ మండిపడుతున్నాడు. ఈ విషయంలో కంగనా, క్రిష్‌లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారు. క్రెడిట్ తమదంటే తమదేనని వీధులకెక్కుతున్నారు. తన చిత్రాన్ని వివాదం చేయకుండా ఉండేందుకే ఇంత కాలం మౌనంగా ఉన్నానని క్రిష్ చెబుతున్నాడు.
తాజాగా మరో తెలుగు చిత్రానికి ఇదే వివాదం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో హిట్టయిన కంగనా రౌనత్ ‘క్వీన్’ దక్షిణాది భాషల్లో రీమేక్ అవుతోంది. తెలుగు వెర్షన్‌లో తమన్నా నటిస్తుండగా, నీలకంఠ చాలా భాగం షూటింగ్ చేశాడు. కానీ అతను అర్దాంతరంగా తప్పుకోవడంతో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. మరి ఈ చిత్రం డైరెక్టర్‌గా క్రెడిట్ ఎవరికి ఇస్తారు? అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నీలకంఠ తప్పుకోవడానికి తమన్నానే కారణమని అంటున్నారు.
కానీ తమన్న మాత్రం తను, నీలకంఠ ఇప్పటికీ మంచి స్నేహితులమేనని చెబుతోంది. ‘మణికర్ణిక’ విడుదలకు ముందు కంగనా కూడా క్రిష్ విషయంలో ఇలానే చెప్పింది. మరి ఈ ‘క్వీన్’ రీమేక్‌గా రూపొందుతున్న ‘దటీజ్ మహాలక్ష్మి’ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సివుంది..!