Advertisementt

గరుడవేగకు ఏం చెప్పానో కల్కీకి అదే: రాజశేఖర్

Mon 04th Feb 2019 01:43 PM
rajasekhar,birthday,kalki,teaser,release,highlights  గరుడవేగకు ఏం చెప్పానో కల్కీకి అదే: రాజశేఖర్
Rajasekhar Birthday Special: Kalki Teaser Released గరుడవేగకు ఏం చెప్పానో కల్కీకి అదే: రాజశేఖర్
Advertisement
Ads by CJ

రాజశేఖర్ పుట్టినరోజు కానుకగా ‘కల్కి’ టీజర్ విడుదల!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడుగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి’. ‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రశంసల్ని ప్రేక్షకుల అభినందనల్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం రాజశేఖర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘సినిమా గురించి విడుదల తర్వాత మాట్లాడుతా.. గరుడవేగ సమయంలోనూ సినిమా విడుదల తర్వాత మాట్లాడతానని చెప్పాను. ఇప్పుడు అంతే. గరుడవేగ తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఆరేడు నెలలు కథ కోసం అన్వేషించాం. అప్పుడే కదా ఓకే చేశాం. తర్వాత ప్రశాంత్ వర్మ డేట్స్ కోసం చాలా రోజులు ఎదురు చూశాం. గరుడవేగకి ప్రవీణ్ సత్తారుతో పని చేసేటప్పుడు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో.... ‘కల్కి’కి ప్రశాంత్ వర్మతో పని చేసేటప్పుడు అంతే కొత్తగా ఫీల్ అవుతున్నా. చాలా రోజుల విరామం తర్వాత సి కళ్యాణ్ గారి సంస్థలో నేను నటిస్తున్న చిత్రమిది. నాకు ప్రమోషన్ వచ్చినట్టు భావిస్తున్నా. కళ్యాణ్ గారు విషయం లేకపోతే సినిమా చేయరు. కథ నచ్చడమే సినిమా విజయంలో ఓ మెట్టు ఎక్కినట్టు. పుట్టినరోజు నాడు కూడా షూటింగ్ చేస్తున్నాం.  లోకంలో పని దొరకడం చాలా కష్టం నాకు పని కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. జీవితం అన్నది చాలా తక్కువ రోజులు. అంతా సంతోషంగా అందరితో మంచిగా జీవితాన్ని ముందుకు సాగించాలి అని కోరుకుంటున్నా’’ అన్నారు.

నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘మా హీరో రాజశేఖర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సూపర్ డూపర్ హిట్ గరుడవేగ తర్వాత... డిఫరెంట్ సినిమా చేయాలనే ఉద్దేశంతో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్న చిత్రమిది. 1980 నేపథ్యంలో కథ సాగుతుంది. ఇంకా 30 పర్సెంట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మిగతా షూటింగ్ పూర్తిచేసి మంచి తేది చూసి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా పూర్తి బాధ్యత ప్రశాంత్ వర్మ మీద పెట్టాం. దర్శకుడికి అతడు తొలి సినిమా కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘శేషు’ తర్వాత రాజశేఖర్ గారితో నేను చేస్తున్న చిత్రమిది. నా సంస్థలో పనిచేయడం ప్రమోషన్ అని ఆయన అన్నారు. అది తప్పు. సి.కళ్యాణ్ అనే నిర్మాత చిన్న సినిమాలు చేసేటప్పుడు... లైట్స్ కొనడానికి కూడా డబ్బులు లేనప్పుడు ఓ తమిళ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొని నన్ను నిర్మాతను చేశారు జీవిత - రాజశేఖర్ దంపతులు. గోరింటాకు సినిమాకు నాకు ఎంతో సహాయం చేశారు. మా కుటుంబ సభ్యులతో నేను చేస్తున్న చిత్రమిది’’ అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘‘నేను ‘అ!’ చిత్రానికి ముందే జీవిత గారిని కలిశా. అప్పుడే ఈ సినిమా చేద్దాం అనుకున్నాం. చాలా రోజులు వెయిట్ చేసి ఈ సినిమా ప్రారంభించాం. ఆ చిత్రానికి ఎంత కష్టపడ్డానో.... దానికి పదిరెట్లు ఈ చిత్రానికి కష్టపడ్డా. ఇదేమీ కాంప్లెక్స్ కథ కాదు.  స్క్రిప్ట్ వర్క్ లో చాలా డీటెయిలింగ్ చేశాం. రాజశేఖర్ గారితో పనిచేయడం అద్భుతమైన అనుభూతి. ఆయన చాలా జోకులు వేస్తూ ఉంటారు. జీవిత గారి ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ. వాళ్ల మీద నాకు ఒక్కటే కంప్లైంట్... ఫుడ్ ఎక్కువ పెడతారు. సినిమా కోసం ఒక్కరోజు 48 గంటలు కంటిన్యూగా షూట్ చేశాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాత్రి ప్రతి పూట బెస్ట్ ఫుడ్ పెట్టేవారు. నేను అది తింటూ బరువు పెరగకూడదనుకొనే వాడిని. ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 70 డ్రాప్స్ రాశాను. కల్కి అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. టైటిల్లో ఎందుకంత డీటైలింగ్ చేశామనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. నా ఫస్ట్ సినిమా అందరికీ అర్థం కాలేదు. ఇది అలా కాదు అందరికీ అర్థమవుతుంది. ‘కల్కి’ కమర్షియల్ సినిమా. ఇంతకు ముందు వచ్చిన కమర్షియల్ సినిమా సూత్రాలను పాటించకుండా... కొత్త కమర్షియల్ ఫార్మాట్ సృష్టించే సినిమా. ఈ సినిమాకు సీక్వెల్స్ చేయాలనుంది. ఒక ఫ్రాంచైజీ తరహాలో. అన్నీ కుదిరితే రాజశేఖర్ గారు నెక్స్ట్ బర్త్ డేకి ‘కల్కి 2’ మొదలవుతుంది. నా అభిమాన నటుడు రాజశేఖర్ గారికి ఈ పుట్టిన రోజు కానుకగా నేను యాంగ్రీ స్టార్ అనే బిరుదు ఇస్తున్నా. సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. 

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘గరుడవేగ పెద్ద హిట్ అయింది. తర్వాత ఏం చేయాలి అనేది ప్రశ్న. గరుడవేగకి ముందు ఎన్నో భయాలు ఉండేవి. అధః  పాతాళానికి వెళ్లి పోయిన తర్వాత మళ్లీ సక్సెస్ లోకి రాగలుగుతామా? లేదా? అనుకున్న రోజులు ఉన్నాయి. మన వెనక ఎన్ని కోట్లు ఉన్నా డబ్బుతో కెరీర్ ని కొనలేం. అటువంటి సమయంలో గరుడవేగ వచ్చింది. ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడుతున్నప్పుడు గరుడవేగ గురించి కూడా మాట్లాడుతున్నారు. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ సినిమా విడుదలైన సమయంలో మా అత్తగారిని, మా అన్నయ్య మురళిని కోల్పోవడం చాలా బాధాకరం. నేను మా అన్నయ్యని ఒరేయ్ పోరా అంటుంటాను. అందువల్ల చాలామంది మురళీ నాకు తమ్ముడు అనుకుంటారు. నేను అన్నయ్య అని పిలిచేది కళ్యాణ్ గారిని. గరుడవేగ తర్వాత ఆయన ఒకసారి ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగారు. ‘కల్కి’ సినిమా గురించి చెప్పా. ‘ఇప్పటివరకు నువ్వు సంపాదించినది ఏం లేదు అన్ని పోగొట్టుకున్నావ్. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఈ సినిమా నేను చేస్తా’ అన్నారు. ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం చాలా కష్టం.  ఓ మహిళగా నాకు ఇంకా కష్టం. మనకు రావాల్సిన డబ్బులు మనం తెచ్చుకోవడానికి పెద్ద ఫైట్ చేయాలి. ఇలాంటి సమయంలో కళ్యాణ్ అన్నయ్య సినిమా చేస్తాను అనడం సంతోషంగా ఉంది. సినిమా కథ స్క్రీన్ ప్లే డైలాగులు ప్రశాంత్ వర్మ రాశాడు. ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ ఇస్తా అన్నాడు. వర్క్ పూర్తయిన తర్వాత అతన్ని డైరెక్షన్ చేయమని చెప్పాను. ‘అ!’ విజయం తర్వాత అతనికి చాలా అవకాశాలు వచ్చాయి. ఏ సినిమా చేయాలి అని ఆలోచించుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. చివరకు సినిమా చేస్తానన్నాడు.  ప్రశాంత్ వర్మ. అంగీకరించడమే సగం విజయంగా నేను భావించాను. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మే నెలలో సినిమాను విడుదల చేయాలని కోరుతున్నా.’’ అన్నారు. 

ఈ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ దంపతుల కుమార్తెలు శివానీ శివాత్మిక, సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర,  ఆర్ట్ డైరెక్టర్  నాగేంద్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ కేక్ కట్ చేశారు.

అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ప్రధాన తారాగణం. 

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

Rajasekhar Birthday Special: Kalki Teaser Released:

Kalki Teaser Release Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ