తెలుగులో ప్రస్తుతం జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణల తర్వాత కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని, యాక్షన్, ఎమోషన్స్‌ని సమపాళ్లలో రంగరిస్తూ తక్కువ బడ్జెట్‌తో వరుస విజయాలు సాధిస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి పేరు మారుమోగిపోతోంది. ఈయనతో చిత్రం చేస్తే అది హీరోలకు, నిర్మాతలకు కూడా సేఫ్ ప్రాజెక్ట్‌గా మారుతుండటం విశేషం. ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్’లతో పాటు తాజాగా దిల్‌రాజు నిర్మాతగా విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో ఆయన తీసిన ‘ఎఫ్ 2’ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచి, తన సత్తా చాటింది. 25కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 100కోట్లకు పైగా వసూలు చేసి రూపాయికి నాలుగైదు రూపాయల లాభాలను ఆర్జించిపెట్టింది. దాంతో ఇప్పుడు అత్యంత క్రేజ్ ఉన్న దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు మారుమోగుతోంది.
ఇక ఈయన త్వరలో ‘ఎఫ్ 3’ కూడా తీస్తానని ప్రకటించాడు. ఇందులో కూడా విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు నటించడం ఖాయమని దిల్‌రాజు కూడా ప్రకటించాడు. కాగా ఇందులో మరో స్టార్‌కి కూడా అవకాశం ఉందని స్వయాన దిల్‌రాజు ఒప్పుకోవడం, ఆ మూడో స్టారే రవితేజ అని ప్రచారం జరగడం జరిగింది. నిజానికి ‘ఎఫ్ 3’కి మూలాన్ని ‘ఎఫ్ 2’ తో పాటు ‘రాజా ది గ్రేట్’లని కూడా కలిపి వండి వార్చనున్నారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈ మధ్యలో అనిల్ రావిపూడి ఏ హీరోతో పనిచేస్తాడు? అనే అంశం ఆసక్తిని రేపుతోంది.
ప్రస్తుతం దాదాపు యంగ్‌స్టార్స్ అందరు తమ తమ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. యంగ్‌స్టార్స్, సీనియర్ స్టార్స్ పరిస్థితి కూడా అంతే. ఇలాంటి సమయంలో అక్కినేని అఖిల్ వంటి వారు అనిల్ రావిపూడిని లాక్ చేస్తే అది ఫ్లాప్‌లలో ఉన్న హీరోలకు మంచి ప్రాజెక్ట్ అవుతుంది. మరి ఇలాంటి స్థితిలో నాగార్జున వంటి వారు ఈ దిశగా ఆలోచించి, తమ వారసులను అనిల్ చేతిలో పెడితే మినిమం గ్యారంటీ హిట్ రావడం ఖాయమని అంటున్నారు. మరి అనిల్‌ని ఎవరు లాక్ చేస్తారో వేచిచూడాలి మరి...!