శంకర్ దేశం గర్వించదగ్గ దర్శకుడే కావచ్చు. మణిరత్నం తర్వాత ఆ స్థాయి దర్శకుడు అనడం కూడా అతిశయోక్తి కాదు. కానీ మణి చిత్రాలు తనదైన ముద్రలో సింపుల్‌గా ఉంటూనే హృదయాలను తాకుతాయి. ఏదిఏమైనా ఓ సినిమాకి కథ, కథనాలు తర్వాతే ఏదైనా...! సినిమాని 24 రంగాలలో దర్శకత్వం మినహా ఏ రంగం డామినేట్ చేసినా ఆ సినిమాకి అవస్థలు ఖాయం. నటీనటుల ఎంపిక నుంచి సాంకేతికత, స్పెషల్ ఎఫెక్ట్, గెటప్‌లు, గ్రాఫిక్స్ నుంచి సెట్స్ వరకు కథలో భాగం అయినప్పుడే అవి బంగారానికి తావి అబ్బినట్లుగా మారుతాయి. సినిమాలో భాగంగా ఉపయోగపడే రీతిలో సెట్స్ ఉండాలే గానీ సెట్స్ కోసం సినిమాలు తీయకూడదు. ఈ విషయం మనం అభినవ బాపుగా పిలుచుకునే గుణశేఖర్ విషయంలో ఎన్నోసార్లు బెడిసికొట్టింది.
సెట్స్‌పై పెట్టిన శ్రద్ద గుణశేఖర్ కథ, కథనాలు, మనసుని కదిలించే ఎమోషన్స్ మీద పెట్టకపోవడం వల్ల ఎంతో టాలెంట్ ఉన్నా కూడా గుణశేఖర్‌కి వరుస పరాజయలు ఎదురవుతున్నాయి. ఎంతటి డైరెక్టర్ అయినా నిర్మాతలకు తలబరువు కాకూడదు. నేడు9 సినిమా అనేది వ్యాపారం అయింది కాబట్టి ఎంతటి దర్శకుడైనా నిర్మాతలను, తనని నమ్మిన బయ్యర్లను దృష్టిలో పెట్టుకోవాలి. సినిమాకి తగ్గ సెట్స్, కథ, కథనాలు, ఎమోషన్స్ విషయంలో రాజమౌళి నేడు ఎందరికో స్ఫూర్తిని ఇస్తున్నాడు. ‘మగధీర, ఈగ, యమదొంగ’ నుంచి ‘బాహుబలి’ వరకు నవరసాలు నింపుకున్న తర్వాతనే భారీ తనం, సాంకేతికత, సెట్స్ వంటి వాటిపై రాజమౌళి దృష్టి పెడతాడు. ఈ చిన్న లాజిక్‌కి గత రెండు మూడు చిత్రాలు శంకర్ మిస్ అవుతున్నాడు. ముఖ్యంగా ‘ఐ, 2.ఓ’ విషయాలలో హ్యూమన్ ఎమోషన్స్ పండించడంలో శంకర్ విఫలమయ్యాడనేది కఠోరవాస్తవం.
ఇక ఆయన చిత్రాలకు బడ్జెట్ లిమిట్ ఉండదని, రాజీ పడడని, ఎంత కాలం షూటింగ్ చేస్తాడో ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా ‘భారతీయుడు 2’కి కూడా ఆదిలోనే హంసపాదు ఎదురైందట. రెండు దశాబ్దాల కిందట వచ్చిన కమల్‌హాసన్-శంకర్‌ల కాంబినేషన్ ‘భారతీయుడు’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కాగా దీని సీక్వెల్ మొదటి షెడ్యూల్‌ని పొలాచ్చిలో రెండు నెలల పాటు కష్టపడి వేసిన సెట్స్‌లో షూటింగ్ ప్రారంభించారు. కానీ వారానికే ఈ సెట్ తాను అనుకున్నట్లు లేదని శంకర్ షూటింగ్‌ని ఆపేశాడట. దీనిని బట్టి ఎవరి పిచ్చి వారికానందం అనే చెప్పాలి.