సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లాంగ్ రన్ హీరోయిన్లకు ఉండదు అనేది నిజమేగానీ, కేవలం గ్లామర్‌నే నమ్ముకున్న వారికే ఇది వర్తిస్తుంది. గతంలో శ్రీదేవి, జయసుధ, జయప్రదలతో పాటు విజయశాంతి నుంచి నయనతార, అనుష్క వంటివారు నటనలో, లేడీసూపర్ స్టార్స్‌గా పేరు తెచ్చుకుని లాంగ్ రన్ కొనసాగించారు. జయసుధ, ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబులతో పాటు చంద్రమోహన్‌తో సహా చిరంజీవితో ‘మగధీరుడు’ చిత్రంలో జోడీ కట్టింది. శ్రీదేవి ఏయన్నార్‌తో పాటు నాగార్జున సరసన కూడా నటించింది. జయప్రద కూడా ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి వారితో పాటు చిరంజీవి సరసన ‘వేట’ చిత్రంలో నటించింది.
ప్రస్తుతం నయనతార, అనుష్కలు, గతంలో విజయశాంతి వంటి వారు కూడా ఇలాగే మెప్పించారు. కానీ నేడు కేవలం గ్లామర్‌నే నమ్ముకుంటున్న పరభాషా హీరోయిన్లు ఒకటి రెండేళ్లు తమ హవా చూపి స్టార్ హీరోయిన్లుగా రాణించినా, కొత్త భామల రాకతో కనుమరుగవుతున్నారు. పూజాహెగ్డే, కియారా అద్వానీ, కీర్తిసురేష్, సాయిపల్లవి వంటి వారితో పాటు సీనియర్లయిన సమంత, కాజల్ అగర్వాల్ , శ్రియ వంటి వారు... ఇక బాలీవుడ్‌లో కత్రినా, దీపికా, ప్రియాంకా వంటి వారు ఇప్పటికీ జోరు చూపుతున్నారు.
ఇక విషయానికి వస్తే తనతో పాటు పరిశ్రమకి ఎంటర్ అయిన రాశిఖన్నా, రెజీనా వంటి వారిని కాదని, రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ తరం స్టార్స్‌తో వరుస చిత్రాలలో నటించింది. ఆ తర్వాత ఈమె హవా తగ్గిపోయింది. బాలీవుడ్‌లో ‘అయ్యారి’ చిత్రం చేసినా ఫలితం లేదు. అయినా మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తూ బాలీవుడ్‌లో తన లక్‌ని పరీక్షించుకుంటోంది. గత ఏడాది కార్తీ సరసన నటించిన ‘ఖాకీ’ చిత్రం కోలీవుడ్‌లో ఈమెకి మంచి గుర్తింపునే తెచ్చింది. మరలా ఇప్పుడు రెండోసారి కార్తీతోనే ‘దేవ్’ చిత్రంలో నటించింది. ఈ మూవీ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అడ్వైంచరస్ హీరోని ప్రేమించే ఆత్మవిశ్వాసం కలిగిన హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. మరోవైపు నాగచైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తర్వాత బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్యలతో మల్టీస్టారర్‌గా రూపొందనున్న ‘వెంకీమామ’లో చైతుకి జోడీగా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు హిట్టయితేనే ఈమె కాజల్ అగర్వాల్‌లా మరలా ఫామ్‌లోకి వస్తుంది. లేదంటే తిరుగుటపా ఖాయమనే చెప్పాలి.