జనవరి నెలలో ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. బడా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేశాయి. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీసు వద్దకు వచ్చిన అనిల్ రావిపూడి - దిల్ రాజుల ఎఫ్ 2 సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా కూడా తుస్ మనేదే కానీ... థియేటర్స్ లో ఆకట్టుకునే సినిమాల్లేక ప్రేక్షకులకు ఎఫ్ 2 తప్ప మరో ఆప్షన్ కనబడలేదు. మొదటి భాగంలో కామెడీ అదిరిపోయినా.. సెకండ్ హాఫ్ పరమ బోరింగ్ గా వున్నా ఎఫ్ 2 ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు ప్రేక్షకులు. ఇక జనవరిలో వచ్చిన మిగతా సినిమాలు ఎన్టీఆర్ కథానాయకుడు, పేట, వినయ విధేయ రామ, అఖిల్ మిస్టర్ మజ్ను, మణికర్ణిక ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి.
ఇక ఫిబ్రవరి 1 శుక్రవారం నిర్మాతలకు మంచి అవకాశం. ఎందుకంటే జనవరిలో సరైన సినిమాలేక బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ శుక్రవారం ఎలాంటి సినిమా వస్తుందో... చూసేద్దాం అనుకుంటే అసలు ఈ శుక్రవారం పేరున్న ఒక్క సినిమా కూడా బాక్సాఫీసు వద్దకు రావడం లేదు. అంటే ఈ శుక్రవారం చాలా చప్పగా ఉండబోతుంది. అసలే ప్రేక్షకులు మంచి సినిమా లేక విలవిల్లాడుతుంటే.... ఇప్పుడు ఈ శుక్రవారం ఒక్క సినిమా కూడా లేక మరీ బోర్ ఫిలయ్యే పరిస్థితి. మరి ఇంతమంచి అవకాశాన్ని చాలామంది చిన్నా, పెద్ద నిర్మాతలు వదిలేసుకున్నట్టే.
అసలు పెద్ద సినిమాల హడావిడిలో కొట్టుకుపోయే కన్నా.. థియేటర్స్ లేవని గగ్గోలు పెట్టే నిర్మాతలకు ఈ శుక్రవారం లాంటి వారం బాగా కలిసొచ్చేదే. కానీ ఎవ్వరూ ఈ వారం సినిమాలు రిలీజ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. అందుకే తన సినిమా ప్లాప్ అని తెలిసినా.. థియేటర్స్ లో మంచి సినిమాలేవీ లేవు కనుక అఖిల్ తన మిస్టర్ మజ్ను సినిమాని ప్రమోషన్స్ తో లేపుదామనుకుంటున్నాడు. అందుకే కాలేజెస్, థియేటర్స్ అంటూ తెగ హడావిడి చేస్తున్నాడు. అసలే వీక్ టాక్ తో లేవలేకపోతున్న మిస్టర్ మజ్నుని తన మాటల గారడీతో లేపాలి అఖిల్ ఆలోచన. మరి ప్రేక్షకులు పిచ్చోళ్ళేమి కాదు. ఏది ఏమైనా ఈ శుక్రవారం మాత్రం సినీ లవర్స్ ఉసూరుమనాల్సిందే.