తెలుగులో ఉన్న అభిరుచి, జడ్జిమెంట్ ఉన్న నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. ఆయన ఓ చిత్రం తీస్తున్నా, లేదా ఏదైనా చిత్రాన్ని పంపిణీ చేస్తున్నా ఇతర బయ్యర్లు, ప్రేక్షకుల్లో ఆ చిత్రంపై అంచనాలు, నమ్మకం భారీగా ఏర్పడతాయి. తన 15 ఏళ్ల కెరీర్‌లో ఆయన సాధించిన ఘనత గురించి ఒక్క మాటలో చెప్పడం సరికాదు.
ఇక ఈయన సంక్రాంతికి ‘ఎఫ్ 2’ చిత్రం ద్వారా సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. ఈ చిత్రం 25కోట్లతో నిర్మించబడి, ఏకంగా 100కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే రూపాయికి నాలుగు రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఇప్పటివరకు ఈయన 31 చిత్రాలను నిర్మించాడు. ‘ఎఫ్ 2’ తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మరోసారి అశ్వనీదత్, పివిపిల భాగస్వామ్యంలో ‘మహర్షి’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘మహర్షి’ మహేష్‌కి ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్5న విడుదల చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. కానీ ఈ మూవీ మరోసారి వాయిదా పడనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తాజాగా దీనిపై దిల్‌రాజు స్పందించాడు. ‘మహర్షి’ చిత్రం వాయిదా పడలేదని, అనుకున్నట్లుగా ఏప్రిల్ 25నే విడుదల ఖాయమని స్పష్టం చేశాడు. ఇక తన 15ఏళ్ల కెరీర్‌లో దిల్‌రాజు కొన్ని డబ్బింగ్ చిత్రాలను విడుదల చేశాడే గానీ రీమేక్‌లపై దృష్టి పెట్టలేదు. కానీ తన కెరీర్‌లో మొదటిసారిగా తమిళంలో విజయ్‌సేతుపతి, త్రిషల కాంబినేషన్‌లో సూపర్‌హిట్ అయిన ‘96’ని శర్వానంద్, సమంతలతో తమిళ ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్‌కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.
తనకి మంచి ఆర్టిస్టులు కావాలని ప్రేమ్‌కుమార్ కోరాడని, దాంతో శర్వానంద్, సమంతలను ఆయనకి అందించానని తెలిపాడు. మొదట్లో ఈ పాత్ర చేయడానికి సమంత ఒప్పుకోలేదన్నది నిజమేనని, కానీ తాను పూర్తిగా కథ, టెక్నీషియన్స్, తెలుగులో ఈ చిత్రాన్ని ఎలా తీయబోతున్నాం? ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయనే విషయాలను ఆమెకి తెలిపిన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.