గతకాలం నాటి స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి వారు ఏడాదికి పలు చిత్రాలు చేసేవారు. దాంతో వారు నటించిన చిత్రాలు వందల్లో ఉండేవి. సూపర్‌స్టార్ కృష్ణ అయితే ఏడాదికి డజనుకు పైగా చిత్రాలలో, రోజుకి మూడు నాలుగు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనేవాడు. కాబట్టే ఆయన అన్ని వందల చిత్రాలు చేయగలిగాడు. కానీ చిరంజీవి తరం నుంచి ఈ దూకుడు తగ్గింది. మెగాస్టార్‌గా చిరంజీవి ఎదగక ముందు ఆయన కూడా స్పీడ్‌గానే సినిమాలు చేసేవాడు. కానీ మెగాస్టార్ వంటి బరువు బాధ్యతలు వచ్చిన తర్వాత ఆయన కూడా ఏడాదికి ఒక చిత్రం అనే రూట్‌లోనే వెళ్లాడు. మొదట్లో కాస్త జోరుగా నటించాడు కాబట్టే ఆయన కనీసం 150 చిత్రాల మార్క్‌ని దాటగలిగాడు.
బాలయ్య కూడా వరుస చిత్రాలు చేయడం వల్ల ‘గౌతమీ పుత్రశాతకర్ణి’తో 100 చిత్రాలు పూర్తి చేసి ఇంకా జోరు చూపిస్తున్నాడు. కింగ్ నాగార్జున కూడా వంద చిత్రాలకు చేరువలో ఉన్నాడు. కానీ ఆయన నటించిన చిత్రాల సంఖ్య విషయంలో పలు వాదనలు ఉండటంతో తన 100వ చిత్రం ఎప్పుడు? ఎలా? అనేది తానే స్వయంగా ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. ఇక నేటి యంగ్‌స్టార్స్ కేవలం 25 చిత్రాలకే ప్రతిష్టాత్మకంగా చేసుకుంటున్నారు. బహుశా వీరు లాంగ్ రన్‌లో అర్ధశతకం సాధిస్తే గొప్ప.
అయితే మరో సీనియర్ స్టార్ అయిన విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే ఆయన నటించిన ‘ఎఫ్ 2’ చిత్రం 73వ చిత్రం అవుతుంది. 74గా బాబి దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చేయనున్నాడు. ఇందులో బాబాయ్‌తో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న అబ్బాయ్ రానా కూడా కీలకపాత్రను పోషిస్తాడట. సీనియర్ స్టార్స్‌కి హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉండటంతో ‘సుభాష్‌చంద్రబోస్, గోపాల గోపాల’ చిత్రాలలో తన సరసన నటించిన సీనియర్ హీరోయిన్ శ్రియతోనే వెంకీ జత కట్టనున్నాడు.
దీని తర్వాత 75వ చిత్రంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ నటించడం ఖాయమైంది. మరి వెంకీ తన కెరీర్‌లో సెంచరీ చిత్రాలను పూర్తి చేస్తాడా? అనే అనుమానాలు రావడం సహజం. మరి ఈ విషయంలో వెంకీ నోరు విప్పితే గానీ అసలు విషయం తెలియదని చెప్పాలి.