మనదేశంలో సినిమా, క్రికెట్ అనేవి మతాల కంటే ఎక్కువ. బాలీవుడ్ విషయానికి వస్తే కల్పిత గాథే అయినా ‘లగాన్’ సాధించిన విజయం క్రికెట్ నేపధ్యంలో రూపొందే చిత్రాలకు ఉండే క్రేజ్‌ని తెలియజేస్తుంది. ఇప్పటికే సచిన్, ధోని, అజారుద్దీన్ వంటి క్రికెటర్ల బయోపిక్స్ రూపొందాయి. నిజానికి ఇండియాలో క్రికెట్ విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకోవడానికి కపిల్‌దేవ్ సారధ్యంలో 1983లో ఇండియా ఇంగ్లండ్‌లో ఫైనల్‌లో వెస్టిండీస్‌ని ఓడించి వన్డే క్రికెట్ కప్ గెలుచుకోవడం కీలకమలుపు.
ఇక నాటి ప్రపంచకప్ నేపధ్యంలో ప్రస్తుతం ‘83’ అనే బయోపిక్ రూపొందుతోంది. కెప్టెన్ కపిల్‌దేవ్‌గా రణవీర్‌సింగ్, బల్విందర్‌సింగ్ సంధు పాత్రకి పంజాబీ నటుడు అమ్మీవీర్క్ ఎంపికయ్యారు. తాజాగా కృష్ణమాచార్య శ్రీకాంత్ పాత్రకి ‘రంగం’ అనే డబ్బింగ్ చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న జీవా ఎంపిక అయ్యాడు. ఇదే సమయంలో మిథాలీరాజ్‌పై కూడా బయోపిక్ రూపొందింది. తెలుగులో ఇటువంటి బయోపిక్‌లు రూపొందకపోయినా జస్ట్ క్రికెటర్ పాత్రలో ఇప్పటికే వెంకటేష్, సుమంత్ వంటి వారు నటించారు. ప్రస్తుతం ‘జెర్సీ’ చిత్రంలో పూర్తి స్థాయి క్రికెటర్‌గా నాని కనిపించబోతున్నాడు. శివనిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య-సమంత నటిస్తున్న ‘మజిలి’ పోస్టర్‌లో కూడా నాగచైతన్య క్రికెటర్ లుక్‌లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు.
ఇక తాజా సమాచారం ప్రకారం సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రంలో క్రికెటర్ లుక్‌లో మహేష్ కూడా కనిపిస్తాడనే వార్త ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇందులో మహేష్ ఫారిన్ బిజినెస్ మాగ్నేట్‌గా, పల్లెటూరిలో రైతుగా ఇలా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. మీసం, గడ్డాలు పెంచిన లుక్, క్లీన్‌షేవ్‌తో పాటు క్రికెటర్ లుక్ కూడా ఉండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.