కోలీవుడ్‌లో దర్శకుడు సెల్వరాఘవన్‌కి మంచి పేరుంది. కథాబలం, ఫీల్‌గుడ్ ఉండేలా సినిమాలను తెరకెక్కిస్తాడనే గుడ్‌విల్ ఆయన సొంతం. ఈయన దాదాపు 15ఏళ్ల కిందట ‘7/జి బృందావనం కాలనీ’ తో తెలుగు ఆడియన్స్‌ని కూడా మెప్పించాడు. భారీ చిత్రాల ఎవర్‌గ్రీన్ నిర్మాతగా నాడు కొనసాగుతోన్న ఎ.యం. రత్నంకి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఉన్నా కూడా ఆయనకు పుత్రోత్సాహాన్ని కలిగించిన ఏకైక చిత్రం ఇదే అని చెప్పాలి. తన చిన్నకుమారుడు రవికృష్ణ ఇందులో హీరోగా నటించాడు. అల్లరి చిల్లరిగా తిరిగుతూ, ప్రేయసిని మర్చిపోలేని పాత్రలో రవికృష్ణ అందరినీ ఆకట్టుకున్నాడు.
ఇక సోనియా అగర్వాల్ నిండైన నటన, సుమన్‌శెట్టి కామెడీ వంటివి ఈ చిత్రం ఘనవిజయం సాధించేందుకు దోహదపడ్డాయి. తెలుగులో మాత్రం సెల్వరాఘవన్ శ్రీరాఘవ్‌గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్‌తో తెలుగులో స్ట్రెయిట్ చిత్రంగా ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే వంటి సూపర్‌హిట్‌ని అందించాడు. కానీ ఆ తర్వాత ఆయనతో పాటు రత్నం, రవికృష్ణ, సోనియా అందరు ఫేడవుట్ అయ్యారు. ఎంతో భారీగా అనుష్క-ఆర్యలతో తీసిన ‘వర్ణ’ చిత్రం డిజాస్టర్ అయింది. ఇక తమిళంలో ‘7/జి రెయిన్‌బో కాలనీ’, తెలుగులో ‘7/జి బృందాలన కాలనీ’గా వచ్చిన ఈ చిత్రం బెంగాళీ, ఒరియా భాషల్లో కూడా రీమేక్ అయి పెద్ద విజయం సాధించింది. ఇదే క్రమంలో సెల్వరాఘవన్ ఆ చిత్రంలో నటించిన సోనియాని వివాహం చేసుకోవడం, తర్వాత విడిపోవడం కూడా జరిగింది. ఈ చిత్రాన్ని ఇంత కాలానికి బాలీవుడ్‌లో రీమేక్ చేస్తుండటం విశేషం.
ఇక సెల్వరాఘవన్ విషయానికి వస్తే ఆయనకు చాలా కాలం తర్వాత మరలా తనని తాను నిరూపించుకునే అవకాశం లభించింది. కోలీవుడ్ స్టార్ సూర్య ఆయనకి అవకాశం ఇచ్చాడు. ‘ఎన్జీకే’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో సూర్య ఇంతవరకు తాను చేయని వైవిధ్యభరితమైన, విభిన్న పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 14న విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ చిత్రం ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్‌లేని సూర్య-సెల్వరాఘవన్ ఇద్దరికీ కీలకమనే చెప్పాలి.