పవన్ పనికిమాలిన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నాడని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఎంతో గుడ్‌విల్ కలిగిన నాదెండ్ల మనోహర్‌ని పార్టీలోకి చేర్చుకుని వాటికి చెక్ పెట్టాడు. ఇక బండ్లగణేష్ వంటి వారికి కూడా ఆయన నో చెప్పడంతోనే ఇతర పార్టీలను ఎంచుకున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ తరుచుగా చెప్పేమాట ‘ప్రజారాజ్యం’ పార్టీలో జరిగిన తప్పులను పునరావృతం కానివ్వనని, ఆ పార్టీలో చేరి పార్టీకి ద్రోహం చేసిన వారిని దగ్గరకు రానివ్వననేది.
తాజాగా పవన్ ఈ విషయంలో ఓ ముందడుగు వేశాడనే చెప్పాలి. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పలు విధాలుగా ఆయనకు దగ్గరై తర్వాత పార్టీలు మారిన ఘనుల్లో కోట్లకు పడగలెత్తిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకరు. చిరు ఆయన్ని నమ్మినట్లుగా ఎవ్వరినీ నమ్మలేదనేది పచ్చినిజం. తన సామాజిక వర్గం వాడే కావడం, బాగా ఆర్ధిక స్థితిమంతుడు కావడంతో చిరు ఆయనకు పెద్ద పీట వేశాడు. అందునా ఇప్పుడు ఆయన మరో మల్టీమిలియనీర్, చంద్రబాబుకి కుడిభుజం వంటి నారాయణ కార్పొరేట్ సంస్థల అధినేత నారాయణకు వియ్యంకుడు.
తాజాగా పవన్ గంటా జనసేనలో చేరబోతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ‘గంటాతో నాకేం గొడవలు లేవు గానీ, ఆయన నాకు, నా సిద్దాంతాలు, భావాలకు సరిపడే వ్యక్తి కాదని, అలాంటి వారికి పార్టీలో చోటు లేదని స్పష్టమైన సంకేతాలు పంపాడు’. అంతేకాదు.... దేశంలో నేడున్న పార్టీలలో ఎంతో కొంత నిజాయితీ కలిగిన వామపక్షాలతో పొత్తుకు అధికారికంగా పచ్చజెండా ఊపాడు. మొత్తానికి ఈ విషయంలో పవన్ తన భావాలను చాటాడనే చెప్పాలి. ఇక రిపబ్లిక్‌డే కానుకగా తన బాబాయ్ మీద పాటను అబ్బాయ్ రామ్‌చరణ్ విడుదల చేయడంతో పాటు దానికి విశేష స్పందన లభిస్తోంది.